-రైతుబిడ్డగా వచ్చి జడ్జీలను మెప్పించిన తీరు!
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. ఒక్కొక్క కంటెస్టెంట్ స్టేజ్‌పైకి వచ్చి తమ టాలెంట్‌తో పాటు తమ జీవిత ప్రయాణాన్ని పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేటకు చెందిన ఫోక్ సింగర్ ఝాన్సీ మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. పల్లెటూరి నేపథ్యం, వ్యవసాయంపై మమకారం, జానపద గానం, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఆమె చెప్పిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఝాన్సీ తనను తాను పరిచయం చేసుకుంటూ.. తమది కోమటికుంట అనే పల్లెటూరు అని, తాము ముగ్గురు ఆడపిల్లలమని చెప్పింది. పీజీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసిన తాను ఫోక్ సింగర్‌గా పల్లెల్లో జానపద పాటలు పాడుతుంటానని తెలిపింది. చదువుతోపాటు తండ్రికి వ్యవసాయ పనుల్లోనూ సాయం చేస్తానని చెప్పింది. ‘కొడుకులు ఉంటే చేతికి సాయం వచ్చేది. కానీ ఆడపిల్లలు పుట్టారని మా నాన్న ఎప్పుడూ బాధపడకూడదనుకున్నాను. అందుకే పొలం పనుల్లోనూ నాన్నకు సాయం చేస్తాను’ అని ఝాన్సీ చెప్పింది. 2016లోనే తాను పొలం దున్నడం నేర్చుకున్నానని తెలిపింది.
తాను మూడో అమ్మాయిగా పుట్టినప్పుడు ‘మళ్లీ ఆడపిల్ల పుట్టిందా?’ అంటూ తన కుటుంబ సభ్యులు బాధపడ్డారని గుర్తుచేసుకుంది. కానీ ఇప్పుడు అదే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి.. “మీరు కన్నది ఆడపిల్ల కాదు.. నలుగురికి ఆదర్శంగా నిలిచే బిడ్డ’ అని ఇతరులు చెబుతుంటే వాళ్లు ఎంతో సంతోషిస్తారని భావోద్వేగంగా చెప్పింది. చిన్నప్పటి నుంచే పాటలపై ఆసక్తి ఉన్న ఝాన్సీ.. మూడో తరగతి నుంచే జానపద గీతాలు పాడుతున్నానని తెలిపింది. ఇంటర్‌లో 926 మార్కులు సాధించానని చెప్పింది. తన గొంతుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించడంతో సోషల్ మీడియాలోనూ గుర్తింపు వచ్చిందని, అయితే తగిన అవకాశాలు మాత్రం రాలేదని చెప్పింది.
‘బిగ్‌బాస్ నాకు ఒక పెద్ద ప్లాట్‌ఫామ్. నా గొంతును కోట్ల మందికి పరిచయం చేయాలి. నేనేంటో ఇంకా ప్రూవ్ చేసుకోవాలి’ అంటూ తన లక్ష్యాన్ని వెల్లడించింది. అంతేకాదు.. వ్యవసాయాన్ని వదిలిపెడుతున్న యువతకు తాను స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. తాను చేసే వ్యవసాయ పనులను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటానని, యువత కూడా వ్యవసాయం వైపు రావాలన్నదే తన ఉద్దేశమని తెలిపింది. ఝాన్సీ మాటలు విన్న నవదీప్ వెంటనే ఆమె సోషల్ మీడియా ఐడీ అడిగి ఫాలో అయ్యాడు. అనంతరం ఆమె జానపద పాట పాడి స్టేజ్‌పై అలరించింది. ఆమె పాటకు శ్రీముఖి ‘మట్టిలో మాణిక్యం’ అంటూ ప్రశంసలు కురిపించింది.
అయితే ఝాన్సీ లక్ష్యం పాటలకే పరిమితం కాలేదు. తన తండ్రికి పిల్లల్లో ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉందని, అందుకే తాను ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల కోసం సిద్ధమవుతున్నానని చెప్పింది. ఒకవైపు పొలం పనులు, మరోవైపు పాటలు, ఇంకోవైపు ఉద్యోగ పరీక్షలకు సిద్ధం కావడం కష్టంగానే ఉందని తెలిపింది.
రైతుల కష్టాలపై నవదీప్ ప్రశ్నించగా ఝాన్సీ చెప్పిన సమాధానం ప్రత్యేకంగా నిలిచింది. ‘పెట్టుబడి పెట్టకుండా పంట పండదు. కానీ చివరికి పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి ఉంటుంది. అయినా వ్యవసాయాన్ని వదిలిపెట్టలేం. రాత్రింబవళ్లు ప్రకృతితోనే పోటీ పడాలి’ అంటూ రైతుల పరిస్థితిని వివరించింది.
ఆమె సమాధానాన్ని విన్న నవదీప్.. ‘చాలా బాగా పెంచారమ్మ నిన్ను’ అంటూ ప్రశంసించాడు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకోగలదా అన్నది తెలుసుకోవడానికి శ్రీముఖి ఆమెను ప్రశ్నించింది.
‘నువ్వు చాలా మంచిదానిలా ఉన్నావు. కానీ అక్కడ చాలామంది తిక్క తిక్కగా ప్రవర్తిస్తారు. నామినేషన్స్‌లో ఏవేవో అంటారు. అవన్నీ భరిస్తావా?’ అని అడిగింది. దానికి ఝాన్సీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ‘భరించాలి. నా వరకు రానంతవరకు ఓకే. కానీ నా వరకు వస్తే ఊరుకోను’ అని స్పష్టం చేసింది.
‘గొడవలు పెడతావా?’ అని నవదీప్ అడిగితే.. బయటివాళ్లతో తనకు గొడవలు ఉండవని, ఇంట్లో మాత్రం తామే నలుగురం చిన్న చిన్న విషయాలకు కొట్టుకోవడం, తిట్టుకోవడం జరుగుతుందని నవ్వుతూ చెప్పింది. చివరకు రిమోట్ విషయంలో అమ్మ సీరియల్స్ చూడాలంటుందని, మరో అక్క న్యూస్ చూడాలంటుందని చెప్పడంతో స్టేజ్‌పై నవ్వులు పూశాయి.
ఇక శ్రీముఖి ఆమెకు అసలు పరీక్ష పెట్టింది. ‘బిగ్‌బాస్ మొదటి రోజే నామినేషన్స్ వచ్చాయి. ‘బిగ్‌బాస్‌కు ఝాన్సీ వద్దు.. సెట్ అవ్వదు’ అని నేను అంటే.. నువ్వేమంటావు?’ అని ప్రశ్నించింది. ఝాన్సీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. ‘నేను సెట్ కాను అని మీరు చెబుతున్నప్పుడు.. మీరు ఎలా సెట్ అవుతారో మీరు చెప్పండి’ అంటూ శ్రీముఖినే ప్రశ్నించింది.
‘నేను సెట్ అవుతాను కాబట్టే షో వాళ్లు నన్ను తీసుకున్నారనిపిస్తోంది’ అని శ్రీముఖి చెప్పగా.. ‘అది మీరు అనుకుంటున్నారు. నేను బెటర్ అని నేను అనుకుంటున్నా’ అంటూ ఝాన్సీ ధైర్యంగా బదులిచ్చింది. దీంతో జడ్జీలు కూడా ఆమె కాన్ఫిడెన్స్‌ను గమనించారు. ‘ఎలా బెటర్ అంటున్నావో చెప్పు’ అని శ్రీముఖి అడగ్గా.. ‘ఏదైనా టాస్క్ ఇవ్వండి. అది ఓడిపోతే నేను వీక్ అని అనుకుంటాను’ అంటూ ఝాన్సీ సవాల్ విసిరింది. ఆ తర్వాత ‘దారి చూడు’ పాటకు బిందు మాధవితో కలిసి డాన్స్ చేసి తనలోని మరో టాలెంట్‌ను చూపించింది.
ఝాన్సీ ప్రదర్శనకు నవదీప్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. బిందు మాధవి కూడా గ్రీన్ ఫ్లాగ్ ఇస్తూ.. ‘నువ్వు ఈ షోలో ఉంటే చూడాలనుంది. నీలో ఒక అమాయకత్వం ఉంది. అది ఇంకొంచెం ముందుకు రావాలి’ అంటూ ప్రశంసించింది. అయితే అభిజిత్ మాత్రం రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. అయినప్పటికీ అతడి మాటల్లో ఝాన్సీపై ప్రశంసలే ఎక్కువగా కనిపించాయి. “నా ఫేవరేట్ వెహికల్ ట్రాక్టర్. దాన్ని నడపడం నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా స్ట్రెస్‌గా అనిపిస్తే ఫార్మ్‌కి వెళ్లి ట్రాక్టర్ నడుపుతుంటాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు నువ్వు చాలా నచ్చావు ఝాన్సీ. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు. ఏదైనా స్ట్రైట్‌గా చెబుతావు’ అని అభిజిత్ చెప్పాడు.
అయితే శ్రీముఖి ఇచ్చిన టాస్క్‌లో ఝాన్సీ చూపించిన ధైర్యాన్ని కూడా అభిజిత్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘శ్రీముఖి టాస్క్ ఇచ్చినప్పుడు ‘మీరు’ నుంచి ‘నువ్వు’కి షిఫ్ట్ అయ్యావు చూడు.. అది ఈ హౌస్‌కు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికీ మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ లక్షణం ఉండాలి. అయితే నెక్స్ట్ రౌండ్‌లో నిన్ను కొంచెం సానబెట్టాలి’ అంటూ రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు.
మొత్తంగా ఝాన్సీ ఎంట్రీ బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో ప్రత్యేకంగా నిలిచింది. రైతు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా వ్యవసాయాన్ని కొనసాగిస్తూ, జానపద గాయనిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుని, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న ఝాన్సీ.. బిగ్‌బాస్‌ను తన ప్రతిభను మరింత మందికి పరిచయం చేసుకునే వేదికగా చూస్తోంది. జడ్జీల ప్రశంసలు, ఆమెలో కనిపించిన ఆత్మవిశ్వాసం, టాస్క్‌లో చూపించిన ధైర్యం ఆమెకు ప్లస్ పాయింట్లుగా నిలిచినా.. అభిజిత్ ఇచ్చిన రెడ్ ఫ్లాగ్‌తో తదుపరి రౌండ్‌లో ఝాన్సీకి అసలు పరీక్ష మొదలైనట్టే కనిపిస్తోంది.
