పొదల్లో పసికందు.. ఏడుపు విని ప్రాణం కాపాడిన యువకుడు!

Baby
విజయవాడ నగరంలో అర్ధరాత్రి వేళ వినిపించిన ఓ పసికందు ఏడుపు.. ఓ యువకుడి అడుగులను ఆపింది. ఆ ఏడుపును నిర్లక్ష్యం చేసి ఉంటే ఆ చిన్నారి పరిస్థితి ఏమయ్యేదో ఊహించడం కూడా కష్టం. కానీ, కటికల విజయ్‌బాబు చూపిన మానవత్వం ఇప్పుడు ఆ పసికందు ప్రాణానికి అండగా నిలిచింది.

శుక్రవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో భోజనం కోసం బీఆర్‌టీఎస్ రోడ్డులోని ఫుడ్‌కోర్టుకు వెళ్లిన విజయ్‌బాబు, అనంతరం టాయిలెట్ కోసం ఎస్‌టీపీఎం రైల్వే క్వార్టర్స్, రైల్వే గ్రౌండ్ పక్కనున్న సిమెంట్ రోడ్డువైపు వెళ్లాడు . ఆ సమయంలో చిన్న చిన్న పొదల మధ్య నుంచి పసికందు ఏడుపు వినిపించింది.

అది సాధారణ శబ్దం కాదని భావించిన ఆయన వెంటనే ఆ దిశగా వెళ్లారు. అక్కడ చూసిన దృశ్యం ఆయనను కలచివేసింది. కేవలం రెండు నుంచి మూడు రోజుల వయసున్న ఓ ఆడ శిశువు పొదల్లో ఒంటరిగా కనిపించింది. ఆ చిన్నారిని ఎవరో అక్కడ వదిలి వెళ్లిపోయినట్లు గుర్తించారు.

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పసికందును తన చేతుల్లోకి తీసుకున్న విజయ్‌బాబు, వెంటనే బ్లాసమ్స్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందేలా చేశారు. అనంతరం సత్యనారాయణపురం పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తల్లిదండ్రుల ఒడిలో ఉండాల్సిన ఆ చిన్నారి.. పొదల్లో ఒంటరిగా పడిన పరిస్థితి హృదయాలను కలిచివేస్తోంది. ఆమెను అక్కడ వదిలి వెళ్లిన వారు ఎవరు? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

అయితే, ఆ రాత్రి చీకట్లో వినిపించిన చిన్న ఏడుపును పట్టించుకున్న విజయ్‌బాబు మాత్రం ఒక విషయం నిరూపించారు—మానవత్వం ఇంకా బతికే ఉంది.. ఒక మనసు స్పందిస్తే, ఒక ప్రాణం నిలబడుతుందని.