ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం 

Bus fire

Anakapalli:  అనకాపల్లి జిల్లాలో ఓప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో మంటలు రేగాయి. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళుతున్న ఓ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. అప్పటికే వాటిని  గమనించిన డ్రైవర్ వెంటనే బస్సులోని ప్రయాణికులను అంతా కిందకు దించేయడంతో ఘోర  ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా..  ఓ ట్రావెల్స్ బస్సు 35 మంది ప్రయాణికులతో భువనేశ్వర్ నుంచి చెన్నైకు బయల్దేరింది. మార్గమధ్యలో ఒక దగ్గర భోజనాలకు  ఆపి పూర్తయ్యాక బస్సు మళ్లీ విశాఖ వైపు పరుగు తీసింది. అయితే సరిగ్గా అనకాపల్లి జిల్లాలోకి రాగానే బస్సు ముందు భాగంలోని ఎడమ వైపు నుంచి ఒక్కసారిగా పొగలు రావడం ప్రారంభమయ్యాయి.  బస్సులో ఉన్న సేఫ్టీ అలారం మోగింది. 

ఇది  వినబడగానే అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును రోడ్డు పక్కన ఆపి, లోపల  ఉన్న ప్రయాణికులను అందరిని కిందకు దించేశాడు. వారంతా కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వేగంగా వ్యాపించాయి. డ్రైవర్ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో  శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అప్పటికే బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది.

ఘటనపై అనకాపల్లి రూరల్ సీఐ నుంజయ్ మాట్లాడుతూ.. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు.బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం పెద్ద ముప్పు తప్పింది, లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదన్నారు. బస్సు ఇంజిన్ భాగంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రమాద స్థలాన్ని పరిశీలించామని, ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులైన ప్రయాణికులకు చెన్నై వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని సీఐ వెల్లడించారు.