ఎబోలా విజృంభణ 

Bebola

కాంగో–ఉగాండాల్లో తొలి నెలలోనే 200 మందికి పైగా మృతి!

ఆఫ్రికాలో మరోసారి ఎబోలా మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. ఉగాండాలో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ తొలి నెలలోనే 200 మందికిపైగా ఉసురు తీసింది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల తీవ్రతను పరిశీలిస్తే, ఇప్పటివరకు తెలిసిన ఎబోలా వ్యాప్తుల్లో ఇదే అత్యంత వేగవంతమైన, తీవ్రమైనదిగా  నిపుణులు పేర్కొంటున్నారు.

ఆఫ్రికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 894 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. వ్యాధి కారణంగా 200 మందికిపైగా మరణించగా, 74 మంది కోలుకున్నారు. ఈ సంఖ్యలు ఎబోలా చరిత్రలో ఇదే దశలో నమోదైన అత్యధిక కేసులుగా గుర్తించబడ్డాయి.

ఆఫ్రికా సీడీసీ వైద్య అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ వెస్సామ్ మంకౌలా మాట్లాడుతూ 2000లో ఉగాండాలో నమోదైన ఎబోలా వ్యాప్తి ఇదే దశలో 281 కేసులకు మాత్రమే పరిమితమైందని, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య దానికంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని తెలిపారు. దీంతో ప్రస్తుత పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చన్నారు.

మే 15న ఈ వ్యాధి అధికారికంగా నిర్ధారణ అయినా, అంతకుముందే కొన్ని వారాలుగా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనట్లు అనుమానాలు ఉన్నాయి. అందువల్ల వాస్తవ కేసుల సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువగా ఉండే అవకాశముందని ఆరోగ్య అధికారులు భావిస్తున్నారు. గత వారం కేసులు 38 శాతం పెరగడం పరిస్థితి ఎంత వేగంగా మారుతోందో సూచిస్తోంది.

ప్రస్తుతం ఈ వ్యాధి తూర్పు కాంగోలోని 32 ఆరోగ్య మండలాలకు విస్తరించింది. ఇటురి ప్రావిన్స్‌లోనే 90 శాతానికి పైగా కేసులు నమోదయ్యాయి. ఉత్తర కివు, దక్షిణ కివు ప్రాంతాల్లో కూడా వైరస్ వ్యాప్తి కనిపిస్తోంది. సరిహద్దులు దాటి ఉగాండాకు చేరుకున్న ఈ వ్యాధి అక్కడ 19 నిర్ధారిత కేసులు, ఇద్దరి మరణాలకు కారణమైంది.

ఈసారి వ్యాప్తికి కారణమైనది బుండిబుగ్యో వైరస్ అనే ఎబోలా ఉపజాతి. దీనికి ఇప్పటివరకు ఆమోదిత టీకా లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు. ప్రారంభ దశలో ఈ వైరస్‌ను గుర్తించే పరీక్షలు కూడా నిర్వహించకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. గతంలో కాంగోలో నమోదైన చాలా ఎబోలా వ్యాప్తులకు జైర్ వైరస్ కారణమవగా, దానికి టీకా అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుత బుండిబుగ్యో వైరస్ విషయంలో అలాంటి రక్షణ లేదు.

వ్యాధి నియంత్రణలో అత్యంత కీలకమైన కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా పెద్ద సవాలుగా మారింది. నిపుణుల అంచనా ప్రకారం 800కుపైగా నిర్ధారిత కేసులకు సంబంధించి కనీసం 17 వేల నుంచి 35 వేల మంది వరకు అనుమానిత కాంటాక్టులను గుర్తించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కేవలం 4 వేల మందినే గుర్తించి పర్యవేక్షిస్తున్నారు. ఇది అవసరమైన స్థాయిలో 15 శాతానికి కూడా చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇటురి ప్రాంతంలో భద్రతా సమస్యలు, తిరుగుబాటు గ్రూపుల కార్యకలాపాలు, నిరంతర ఘర్షణలు పరిస్థితిని మరింత కఠినతరం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ఈ ప్రాంతంలో కొనసాగుతున్న హింస కారణంగా దాదాపు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రజలు తరచూ ప్రాంతాలు మారుతుండటంతో వ్యాధి వ్యాప్తిని గుర్తించడం, పర్యవేక్షించడం కష్టమవుతోంది.

దట్టమైన అడవులు, దెబ్బతిన్న రహదారులు, మారుమూల గ్రామాలు ఆరోగ్య సిబ్బంది పనిని మరింత ఇబ్బంది  చేస్తున్నాయి. ఖనిజ సంపద అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో వేలాది మంది గనికార్మికులు నిరంతరం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించడం కూడా వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించడంలో అడ్డంకిగా మారుతోంది.

ఎబోలా నియంత్రణ కోసం అంతర్జాతీయ సమాజం 900 మిలియన్ డాలర్లకు పైగా నిధులు ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు కేవలం 90 మిలియన్ డాలర్లు మాత్రమే విడుదలయ్యాయి. అవసరమైన ఆర్థిక సహాయం అందకపోవడంతో నియంత్రణ చర్యలు మందగిస్తున్నాయని ఆఫ్రికా సీడీసీ హెచ్చరించింది.

అలాగే వ్యాధి నియంత్రణ కోసం కనీసం 540 మంది ప్రత్యేక సిబ్బంది అవసరమని అంచనా వేస్తుండగా, ప్రస్తుతం కేవలం 84 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. సిబ్బంది కొరత, నిధుల లోపం, భౌగోళిక సవాళ్లు కలిసి పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రకటించిన నిధులు త్వరగా విడుదలై, ప్రభావిత దేశాలకు చేరాలని ఆఫ్రికా సీడీసీ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, ఎబోలా వ్యాప్తిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి ఇంకా గణనీయమైన సమయం, వనరులు మరియు అంతర్జాతీయ సహకారం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు .