హద్దు మీరితే జరిమానా వాహనాలు స్వాధీనం

(2)

కాకినాడ : రహదారి ప్రమాదాల నివారణే ధ్యేయంగా కాకినాడ జిల్లా పరిధిలో నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరు ఆదేశాల మేరకు డిటిసి శ్రీధర్, ఆర్టీవో మురళీకృష్ణ రవాణా శాఖ అధికారులుకొరడా ఝుళిపిస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.ఈ తనిఖీలలో ప్రధానంగా పరిమితికి మించి భారంతో నడిచే భారీ వాహనాలపై కఠినమైన జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇందులో భాగంగా 20 ఓవర్ లోడింగ్ కేసులు,40 ఇతరాత్ర కేసులు నమోదు చేసి రూ.6,00,000 జరిమానా విధించడం జరిగినదని తెలిపారు.
లీగల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిని గుర్తించి, వాహనాలను సీజ్ చేయడం జరిగినది. ఇందులో భాగంగా 240 కేసులు నమోదు చేసి రూ.12,00,000జరిమానా విధించడం జరిగినది. డ్రైవర్లు ముందు సీటులో కూర్చునే ప్రయాణికులు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని అన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వాహన దారులపై 75 కేసులు నమోదు చేసి రూ.75,000 జరిమానా విధించడం జరిగినది.కాంట్రాక్టు కేరేజ్ బస్సులు, విద్యాసంస్థల బస్సులు పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించి ఇతర వాణిజ్య అవసరాలకు (వివాహాలు, ప్రైవేట్ ఫంక్షన్లు) వాడితే మోటార్ వాహనాల చట్టం ప్రకారం సీజ్ చేయడం జరిగినది. ఇందులో భాగంగా 24 కేసులు నమోదు చేసి రూ.2,87,850 జరిమానా విధించడం జరిగినది.ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను, ముఖ్యంగా స్కూల్ పిల్లలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరిగినది. ఇందులో భాగంగా 40 కేసులు నమోదు చేసి రూ.2,50,000 జరిమానా విధించడం జరిగినది.తనిఖీలతో పాటు,రవాణా శాఖ మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రజలకు, డ్రైవర్లకు క్రింది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు.
పీఎం రాహత్ స్కీమ్ రహదారి ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడం,వారిని ఆదుకోవడంపై ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను వివరించడం జరిగింది.
గుర్తుతెలియని వాహనాలు ఢీకొట్టి పారిపోయే ప్రమాదాలలో బాధితులకు లేదా వారి కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం, క్లెయిమ్ చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. రహదారి ప్రమాదం జరిగిన వెంటనే “గోల్డెన్ అవర్” (మొదటి గంట) లోగా బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే గుడ్ సమారిటన్స్ (మంచి వ్యక్తులను) ప్రోత్సహించేందుకు ఈ పథకం ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.ప్రయాణికుల రక్షణే పరమావధిగా సాగుతున్న ఈ ప్రత్యేక తనిఖీలకు వాహనదారులు,ప్రజలు సహకరించాలని,ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణాన్ని సాగించాలని కోరారు.