మాయమైపోయిన  న్యూ మూర్ ఐలాండ్ 

Newmoor

భారత్-బంగ్లాదేశ్ ఈ ద్వీపం కోసం ఎందుకు ఫైట్ చేసుకున్నాయి… ?

భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య కొన్నేళ్ల పాటు ఒక చిన్న నిర్జన ద్వీపం కోసం తీవ్ర వివాదం కొనసాగింది. కానీ ఆశ్చర్యకరమైన విషయ ఏంటంటే ఈ   ద్వీపమే చివరికి పూర్తిగా సముద్రంలో కలిసిపోయింది. భారత్‌లో “న్యూ మూర్ ఐలాండ్” (New Moore Island), బంగ్లాదేశ్‌లో “సౌత్ తల్పట్టి ఐలాండ్” (South Talpatti Island)గా పిలవబడిన ఈ చిన్న ద్వీపం 1970లలో అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చింది. సుందర్బన్స్ డెల్టా ప్రాంతంలో శక్తివంతమైన తుఫాను సంభవించడం, నదులు తీసుకొచ్చిన మట్టి పేరుకుపోవడం వల్ల హరియాభంగా నది ముఖద్వారం సమీపంలో ఈ ఇసుక ద్వీపం ఏర్పడింది.

మొదట్లో ఇదొక వేస్ట్ ఐలాండ్ లా ఉండేది.  కేవలం కొన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్న ఈ ద్వీపంలో ఎవరూ నివసించేవారు కాదు.  అయితే చిన్నదైనా ఈ ద్వీపం వ్యూహాత్మకంగా కీలకంగా మారింది. దీంతో భారత్, బంగ్లాదేశ్ రెండూ తమదంటే తమది అని పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. 

ఎందుకు అంత ప్రాధాన్యం?: ఈ ద్వీపం యాజమాన్యం ఎవరికి దక్కుతుందన్న దానిపై సముద్ర సరిహద్దుల నిర్ణయం ఆధారపడి ఉండేది.  బంగాళాఖాతంలోని చేపల వేట ప్రాంతాలు, సముద్ర రవాణా మార్గాలు, చమురు , సహజ వాయువు నిల్వలపై  ప్రభావం పడే అవకాశం ఉండేది. ఈ కారణంగానే రెండు దేశాలు తమ తమ మ్యాప్‌లలో ఈ ద్వీపాన్ని చేర్చుకున్నాయి. భారత్ దీనిని “న్యూ మూర్ ఐలాండ్” లేదా “పూర్వాషా”గా పిలవగా, బంగ్లాదేశ్ “సౌత్ తల్పట్టి”గా పేర్కొంది. దశాబ్దాల పాటు ఈ వివాదం కొనసాగింది.

ప్రకృతి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా: రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు సరిహద్దులపై వాదనలు కొనసాగిస్తుండగా ప్రకృతి మాత్రం నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ వెళ్లింది. సుందర్బన్స్ డెల్టా ప్రాంతం అత్యంత సున్నితమైన తీర ప్రాంతం. ఇక్కడ తుఫాన్లు, అలల ఉద్ధృతి, తీర ప్రాంత కోతలు, సముద్ర మట్టం పెరగడం వంటివి నిరంతరం జరుగుతుంటాయి. ఈ ద్వీపం చాలా తక్కువ ఎత్తులో ఉండటంతో శాస్త్రవేత్తలు చాలా కాలం నుంచే ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సముద్ర మట్టం పెరుగుదల, తీర ప్రాంత కోతల కారణంగా ద్వీపం క్రమంగా కుంచించుకుపోతోందని వారు గుర్తించారు.

శాటిలైట్ చిత్రాల్లో కనిపించిన నిజం: 2000ల చివరి నాటికి ఉపగ్రహ చిత్రాలు ఈ ద్వీపంలో భారీ మార్పులను నమోదు చేశాయి. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ సముద్ర అధ్యయన విభాగం పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం, ద్వీపం క్రమంగా సముద్ర జలాల్లో మునిగిపోయింది. చివరకు 2010 ప్రాంతానికి వచ్చేసరికి న్యూ మూర్ ఐలాండ్ పూర్తిగా సముద్రంలో కలిసిపోయిందని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఒకప్పుడు అంతర్జాతీయ వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న భూభాగం పూర్తిగా అదృశ్యమైపోయింది.

వివాదం కూడా ముగిసిపోయింది: ఈ ద్వీపం మాయమయ్యేసరికి  భారత్-బంగ్లాదేశ్ మధ్య కొనసాగిన భూవివాదం   ముగిసిపోయింది. ఒకప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన భూభాగాన్ని సముద్రం తిరిగి స్వాధీనం చేసుకోవడంతో ఆ వివాదానికి అర్థమే లేకుండా పోయింది.

వాతావరణ మార్పులకు హెచ్చరిక: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావంపై చర్చలు జరుగుతున్న సమయంలో న్యూ మూర్ ఐలాండ్ ఉదంతం ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది. సముద్ర మట్టం పెరుగుదల, తీర ప్రాంత కోతలు కేవలం ప్రకృతి మార్పులు మాత్రమే కాదని, అవి దేశాల భూభాగాలనే మాయం చేయగలవని ఈ ఘటన చూపించింది. ప్రపంచంలోనే వాతావరణ మార్పులకు అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో సుందర్బన్స్ ఒకటి.

చరిత్రలో నిలిచిపోయిన ద్వీపం: సముద్రం నుంచి పుట్టిన ఒక చిన్న ద్వీపం… రెండు దేశాల మధ్య దశాబ్దాల పాటు వివాదానికి కారణమైంది. అధికారిక మ్యాప్‌లలో చోటు సంపాదించింది. చివరకు ప్రపంచానికి తెలియకముందే మళ్లీ సముద్రంలో కలిసిపోయింది.

అందుకే న్యూ మూర్ ఐలాండ్ కథ చరిత్రకారులను, పర్యావరణ శాస్త్రవేత్తలను ఇప్పటికీ ఆకర్షిస్తోంది. ఇది కేవలం మాయమైన ద్వీపం కథ మాత్రమే కాదు. ప్రకృతి శక్తి ముందు సరిహద్దులు, రాజకీయాలు కూడా శాశ్వతం కావని గుర్తు చేసే ఒక చారిత్రక గాథ.