మృత్యువునే గెలిచిన ‘మిస్టరీ’ వృక్షం!
ఈ భూమిపై మానవ నాగరికత అప్పుడప్పుడే అడుగులు వేస్తోంది.. ఈజిప్టులో పిరమిడ్ల నిర్మాణానికి అప్పుడే పునాదులు పడుతున్నాయి.. సరిగ్గా అదే సమయంలో అమెరికాలోని ఒక పర్వత ప్రాంతంలో ఓ చిన్న మొక్క మొలిచింది. యుగాలు మారాయి, సామ్రాజ్యాలు కూలిపోయాయి, మంచు యుగాలు వచ్చి వెళ్లాయి. కానీ ఆ మొక్క మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉంది!
అమెరికాలోని కాలిఫోర్నియా ‘వైట్ మౌంటెన్స్’లో నిశ్శబ్దంగా కాలానికి సాక్ష్యంగా నిలిచిన ఆ అద్భుతమే ‘గ్రేట్ బేసిన్ బ్రిస్టిల్‌కోన్ పైన్’ చెట్టు. దాదాపు 5,000 సంవత్సరాల వయసున్న ఈ వృక్షం, భూమిపైనే అత్యంత పురాతనమైన జీవుల్లో ఒకటి.
రహస్యాల ‘మెతుసెలా’: ఆ చెట్టు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఈ అడవిలో అత్యంత ప్రసిద్ధి చెందిన, ఇప్పటివరకు అధికారికంగా గుర్తించిన అతి పెద్ద వయసున్న చెట్టు పేరు ‘మెతుసెలా’ (Methuselah). దీని వయసు సుమారు 4,800 ఏళ్లకు పైమాటే! ఈ చెట్టు కచ్చితంగా ఏ ప్రాంతంలో ఉందనేది అమెరికా అటవీ శాఖ అత్యంత రహస్యంగా ఉంచుతుంది. దానికి ఒక బలమైన కారణం ఉంది.
గతంలో జరిగిన ఘోరం: 1960లో ‘ప్రోమీథియస్’ అనే దాదాపు 4,900 ఏళ్ల వయసున్న చెట్టును ఒక పరిశోధకుడు పొరపాటున నరికివేశాడు. ఆ చేదు జ్ఞాపకం మళ్లీ పునరావృతం కాకూడదనే ఈ గోప్యత.
పర్యాటకుల ముప్పు: చెట్టు వద్దకు జనాలు ఎక్కువగా వస్తే, వారి అడుగుల వల్ల నేల గట్టిపడి వేర్లకు నీరు అందకుండా పోతుంది. కొందరు జ్ఞాపకం కోసం చెట్టు కొమ్మలను విరిచే ప్రమాదం కూడా ఉంది.
కఠినత్వంలోనే దాగున్న ‘జీవన రహస్యం’
సాధారణంగా అనుకూలమైన వాతావరణం ఉంటేనే మొక్కలు బాగా పెరుగుతాయి. ఈ బ్రిస్టిల్‌కోన్ పైన్ చెట్ల మనుగడ రహస్యం మాత్రం దానికి పూర్తి భిన్నం.
పోటీ లేని సామ్రాజ్యం: ఇవి పెరిగే చోట విపరీతమైన చలి, పొడి వాతావరణం, రాతి నేలలు ఉంటాయి. ఇక్కడ వేరే మొక్కలు బతకలేవు. కాబట్టి వీటికి వేటితోనూ పోటీ ఉండదు. అలాగే క్రిమికీటకాలు, అడవి మంటల ముప్పు చాలా తక్కువ.
సెక్టోరియల్ గ్రోత్: ఇది ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ. మెరుపులు పడినా లేదా తీవ్రమైన చలికి చెట్టు ఒక భాగం దెబ్బతిన్నా, మిగిలిన భాగాలు దానికి ప్రభావితం కాకుండా వేల సంవత్సరాల పాటు పెరుగుతూనే ఉంటాయి. బయటికి ఎండిపోయినట్లు కనిపించినా, లోపల జీవం ఉట్టిపడుతూనే ఉంటుంది.
వయసును లెక్కగట్టే ‘టైమ్ మెషిన్’.. డెండ్రోక్రోనాలజీ
ఇంతకీ ఈ చెట్ల వయసును ఎలా కనుగొంటారో తెలుసా? శాస్త్రవేత్తలు ‘డెండ్రోక్రోనాలజీ’ (Dendrochronology) అనే పద్ధతిని ఉపయోగిస్తారు.
చెట్టు కాండం నుంచి ఒక చిన్న నమూనాను తీసి, అందులోని వార్షిక వలయాలను (Tree Rings) లెక్కిస్తారు. ప్రతి వలయం ఒక ఏడాదికి సమానం. ఈ చెట్లలో వలయాలు చాలా పలుచగా ఉంటాయి. ఈ వృక్షాలు కేవలం చెట్లు మాత్రమే కాదు, భూమి వాతావరణ చరిత్రను దాచి ఉంచిన గ్రంథాలయాలు.
వాతావరణ సూచికలు: వలయం వెడల్పుగా ఉంటే ఆ ఏడాది మంచి వర్షపాతం నమోదైందని, పలుచగా ఉంటే కరువు లేదా తీవ్రమైన చలి ఉందని అర్థం.
9000 ఏళ్ల హిస్టరీ: ఇక్కడి ఎండిపోయిన పాత చెక్కలు కూడా వేల ఏళ్లుగా పాడవకుండా అలాగే ఉన్నాయి. బతికున్న చెట్లతో వాటిని పోల్చి శాస్త్రవేత్తలు ఏకంగా 9,000 సంవత్సరాల వాతావరణ చరిత్రను పునర్నిర్మించారు.
రేడియోకార్బన్ డేటింగ్: పురాతన నాగరికతల కాలాన్ని కచ్చితంగా అంచనా వేసే రేడియోకార్బన్ డేటింగ్ పద్ధతిని మరింత మెరుగుపరచడానికి ఈ చెట్లే కీలక ఆధారంగా నిలిచాయి.
రెడ్‌వుడ్స్ లాంటివి కావు.. ఇవి చాలా ప్రత్యేకం!
పెద్ద పెద్ద వృక్షాలు అనగానే మనకు కాలిఫోర్నియాలోని భారీ రెడ్‌వుడ్ చెట్లు గుర్తొస్తాయి. కానీ బ్రిస్టిల్‌కోన్ పైన్ చెట్లు అలా ఉండవు. ఇవి చిన్నగా, వంకరగా, గాలులకు వంగిపోయి కనిపిస్తాయి. ఇవి ఎత్తుగా పెరగడానికి కాకుండా, ఎంతటి విపత్తునైనా తట్టుకుని ఎక్కువ కాలం జీవించడానికి అనువుగా గట్టి కలపతో రూపుదిద్దుకున్నాయి.
‘ప్రపంచంలోనే అత్యంత పురాతన వృక్షం’ అనే రికార్డు ఇక్కడితో ఆగిపోలేదు. చెట్లకు హాని కలగకూడదనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ప్రతి చెట్టునూ పరీక్షించరు. ఇదే వైట్ మౌంటెన్స్ అడవుల్లో 5,000 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న మరికొన్ని రహస్య వృక్షాలు దాగి ఉండే అవకాశం క చ్చితంగా ఉంది!
