మూడు శతాబ్దాలకు పైగా క్రితమే అంతరించిపోయిన దొడో పక్షి గురించి శాస్త్రవేత్తలకు ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అది ఎలా జీవించేది? ఎలా చూసేది? ఆహారాన్ని ఎలా గుర్తించేది? దాని ప్రవర్తన ఎలా ఉండేది? వంటి ప్రశ్నలకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానాలు లేవు. దొడోకు చెందిన పూర్తిస్థాయి పుర్రెలు చాలా తక్కువగా మిగిలి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
తాజాగా జూలోజికల్ జర్నల్ ఆఫ్ ది లిన్నేయన్ సొసైటీ లో ప్రచురితమైన ‘ది సెన్సారీ వరల్డ్ ఆఫ్ ది డోడో అండ్ సొలిటైర్ రివీల్డ్ బై ఎండాకాస్ట్ అండ్ స్కాల్ అనాటమీ’ అనే అధ్యయనం దొడో జీవితంపై కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. సిటీ స్కానింగ్, డిజిటల్ మెదడు పునర్నిర్మాణ సాంకేతికతలను ఉపయోగించి పరిశోధకులు దొడో, సోలిటైర్ పక్షుల పుర్రెలను పరిశీలించారు. వీటిని ప్రస్తుతం జీవిస్తున్న 36 రకాల పావురాలు, డవ్లతో పోల్చారు.
తెలివితక్కువ పక్షి కాదా?
దొడోను చాలాకాలంగా తెలివితక్కువ, అమాయక పక్షిగా చిత్రీకరిస్తున్నారు. తాజా అధ్యయనం ఈ అభిప్రాయాన్ని సవాలు చేస్తోంది. మెదడులో నేర్చుకోవడం, సమస్యలను పరిష్కరించడం వంటి సామర్థ్యాలకు సంబంధించిన టెలెన్సెఫలోన్ భాగం పరిమాణంలో దొడోకు, ఇతర పావురాలు–డవ్లకు పెద్దగా తేడా లేదని పరిశోధకులు గుర్తించారు. అంటే దొడో మిగతా పావురాల కంటే తక్కువ తెలివైనదని చెప్పడానికి ఆధారాలు లేవు. మానవులను చూసి భయపడకుండా దగ్గరకు వచ్చేదనే చారిత్రక వర్ణనల కారణంగానే దొడోను అమాయకంగా, తెలివితక్కువగా భావించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చీకటిలోనూ చూడగలిగేదా?
దొడో కళ్ల నిర్మాణం కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దాని కంటి గుహలు, దాని సమీప జీవ బంధువు అయిన నికోబార్ పావురంతో పోలిస్తే సుమారు 9 శాతం పెద్దవిగా ఉన్నాయి. అయితే దృశ్య సమాచారాన్ని ప్రాసెస్ చేసే మెదడులోని ఆప్టిక్ లోబ్స్ మాత్రం నికోబార్ పావురంతో పోలిస్తే మూడు రెట్లకు పైగా చిన్నవిగా ఉన్నాయి. ఈ విభిన్న లక్షణాలు దొడో కంటి వ్యవస్థ తక్కువ వెలుతురు పరిస్థితులకు కూడా అనుగుణంగా ఉండి ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ దొడో పుర్రెలో కంటి నిర్మాణాన్ని పరిశీలించి శాస్త్రవేత్తలు దాని దృష్టి సామర్థ్యాన్ని 27 సైకిల్స్ పర్ డిగ్రీగా అంచనా వేశారు. ఇది యూరేషియన్ జే, రూక్ వంటి పక్షులతో పోల్చదగిన స్థాయి. దీంతో దొడో కేవలం పగటిపూట మాత్రమే చురుకుగా ఉండేదనే భావనపై కూడా సందేహాలు ఏర్పడ్డాయి. అది తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లో కూడా చురుకుగా ఉండి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. దీనినే క్రెపస్క్యులర్ బిహేవియర్ అంటారు.
వాసనను బాగా గుర్తించేదా?
దొడో మెదడులో వాసనను గుర్తించే ఒల్ఫాక్టరీ బల్బ్స్ కూడా పరిశోధకుల దృష్టిని ఆకర్షించాయి. పరిశీలించిన రెండు పూర్తిస్థాయి నమూనాల్లో ఒకదానిలో ఇవి పెద్దవిగా కనిపించాయి. రెండో నమూనాలో మాత్రం అదే లక్షణం కనిపించలేదు. అందువల్ల దొడోకు అసాధారణంగా వాసన గుర్తించే శక్తి ఉందని ఖచ్చితంగా చెప్పలేకపోయినా, రెండు నమూనాల సగటు పరిమాణం ఇతర పావురాల కంటే ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది.
తక్కువ శబ్దాలను వినగలిగేదా?
దొడో వినికిడి సామర్థ్యానికి సంబంధించిన ఆధారాలను కూడా పరిశోధకులు గుర్తించారు. చెవిలోని ఎండోసీయస్ కోక్లియర్ డక్ట్ పొడవు నికోబార్ పావురంతో పోలిస్తే దొడోలో సుమారు 40 శాతం ఎక్కువగా ఉంది. దీని ఆధారంగా దొడో తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలను బాగా గుర్తించగలిగేదని అంచనా వేశారు. దాని అత్యుత్తమ వినికిడి పరిధి సుమారు 0.7 కిలో హెర్ట్జ్ అంచనా వేశారు. సాధారణంగా చాలా పక్షులు 1 నుంచి 5 కిలో హెర్ట్జ్ మధ్య శబ్దాలను మెరుగ్గా వింటాయి.
ప్రత్యేకమైన పుర్రె నిర్మాణం
పరిశోధకులు మూడు దొడో పుర్రెలు, నాలుగు సోలిటైర్ నమూనాలను పరిశీలించారు. వాటిని వివిధ జీవిస్తున్న పావురాలు, డవ్లతో పోల్చారు. వాటిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియంలో భద్రపరిచిన ‘ఆక్స్ఫర్డ్ దొడో’ కూడా ఉంది. ఈ నమూనాలో కంటి చుట్టూ ఉండే ఎముకల వలయం స్క్లెరల్ రింగ్ పూర్తిగా ఉండటం విశేషం. దీని ద్వారా దొడో కంటి ఆకారం, కంటి అక్ష పొడవును గతంలో కంటే మరింత ఖచ్చితంగా అంచనా వేయగలిగారు.
దొడో మెదడు చుట్టూ ఉన్న పుర్రె భాగం ఇతర పావురాల కంటే గణనీయంగా భిన్నంగా ఉందని అధ్యయనం గుర్తించింది. అది గుండ్రటి, గట్టిగా గాలి ఖాళీలతో కూడిన నిర్మాణాన్ని కలిగి ఉంది.
దొడోపై కొత్త అవగాహన
మొత్తంగా ఈ పరిశోధన దొడోను తెలివితక్కువ, నెమ్మదిగా కదిలే, అమాయక పక్షిగా చూపించే పాత చిత్రాన్ని మార్చుతోంది. దాని కంటి నిర్మాణం, వాసన గుర్తించే సామర్థ్యం, వినికిడి వ్యవస్థ, మెదడు నిర్మాణం వంటి అంశాలు అది తన పరిసరాలకు తగినట్లుగా అనేక ఇంద్రియ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుని ఉండవచ్చని సూచిస్తున్నాయి. మారిషస్ దీవిలో ఆహారాన్ని గుర్తించడం, పరిసరాలను అర్థం చేసుకోవడం, తక్కువ వెలుతురులో కదలడం, ఇతర జీవుల ఉనికిని గుర్తించడం వంటి పనుల్లో ఈ సామర్థ్యాలు దొడోకు సహాయపడి ఉండవచ్చు. అంతరించిపోయిన దొడోపై శాస్త్రవేత్తలకు ఇది కేవలం కొత్త సమాచారం మాత్రమే కాదు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక అపోహకు కూడా సవాలు.
