నక్షత్రాల నదిగా ‘అలకనంద’

Alaknanenda

విశ్వం ఆవిర్భవించిన   150 కోట్ల సంవత్సరాల తర్వాతే మన పాలపుంత (మిల్కీ వే) లాంటి అందమైన సర్పిల (స్పైరల్) గెలాక్సీ ఏర్పడిందని భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గెలాక్సీకి హిమాలయాల్లోని అలకనంద నది పేరును పెట్టారు. ఈ ఆవిష్కరణ విశ్వం ప్రారంభ దశలో గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయనే శాస్త్రవేత్తల అవగాహనను మార్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ పరిశోధనను పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్–టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కు చెందిన పరిశోధకులు రాశి జైన్ ,  యోగేశ్ వడదేకర్ నిర్వహించారు. వారి అధ్యయనం ఇటీవల ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.

జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌తో వెలుగులోకి

అమెరికా, యూరప్, కెనడా సంయుక్తంగా అభివృద్ధి చేసిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్  సేకరించిన డేటాను విశ్లేషిస్తున్న సమయంలో ఈ గెలాక్సీ గుర్తించారు. 2021లో అంతరిక్షంలోకి పంపిన ఈ టెలిస్కోప్, బిగ్ బ్యాంగ్ అనంతరం ఏర్పడిన తొలి నక్షత్రాలు, గెలాక్సీలను అధ్యయనం చేయడానికి రూపొందించబడింది.

పాత సిద్ధాంతాలకు సవాల్

బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిన తొలి గెలాక్సీలు చిన్నవిగా, అస్తవ్యస్తంగా ఉండేవని, కోట్లాది సంవత్సరాల తర్వాత మాత్రమే అవి సర్పిల గెలాక్సీలుగా మారాయని శాస్త్రవేత్తలు భావించేవారు. అలకనంద గెలాక్సీ ఈ అభిప్రాయాన్ని ప్రశ్నిస్తోంది. విశ్వం పుట్టిన కేవలం 150 కోట్ల సంవత్సరాలకే ఇది పూర్తిస్థాయి సర్పిల నిర్మాణాన్ని, స్పష్టమైన రెండు భుజాలను, ప్రకాశవంతమైన కేంద్రాన్ని కలిగి ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది.

70 వేల ఖగోళ వస్తువుల్లో ఒక్కటే

పరిశోధకురాలు రాశి జైన్ మాట్లాడుతూ, జేమ్స్ వెబ్ పంపిన 70 వేల ఖగోళ వస్తువుల సమాచారాన్ని పరిశీలిస్తుండగా ఈ గెలాక్సీ కనిపించిందన్నారు. ‘అంత పెద్దది, పూర్తిగా అభివృద్ధి చెందిన సర్పిల గెలాక్సీ ఒక్కటే కనిపించింది. దీని వ్యాసం సుమారు 30 వేల కాంతి సంవత్సరాలు,’ అని ఆమె తెలిపారు.

గ్రావిటేషనల్ లెన్సింగ్‌తో స్పష్టమైన చిత్రం

ఈ గెలాక్సీ సమీపంలో ఉన్న భారీ అబెల్–2744 గెలాక్సీ క్లస్టర్ గురుత్వాకర్షణ ప్రభావం వల్ల అలకనంద నుంచి వచ్చే కాంతి వంగి, రెండింతలు ప్రకాశవంతంగా కనిపించింది. దీనినే గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటారు. ఈ ప్రభావం వల్ల జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు గెలాక్సీని స్పష్టంగా పరిశీలించడం సాధ్యమైంది.

పాలపుంత కంటే చిన్నదే.. కానీ వేగవంతం

అలకనంద గెలాక్సీ పరిమాణం మన మిల్కీ వేలో మూడో వంతు మాత్రమే. అయినప్పటికీ ఇందులో సుమారు 100 కోట్ల సూర్యుల ద్రవ్యరాశికి సమానమైన నక్షత్రాలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో నక్షత్రాల పుట్టుక చాలా వేగంగా జరుగుతోంది. మిల్కీ వేలో సంవత్సరానికి సుమారు 1–2 సూర్య ద్రవ్యరాశి మేర నక్షత్రాలు ఏర్పడతాయి. అలకనందలో మాత్రం ఏటా 63 సూర్య ద్రవ్యరాశుల మేర కొత్త నక్షత్రాలు పుడుతున్నాయి. అంటే మన గెలాక్సీతో పోలిస్తే సుమారు 30 రెట్లు వేగంగా నక్షత్రాలు ఏర్పడుతున్నాయి. పరిశోధకుల అంచనా ప్రకారం ఈ గెలాక్సీలోని సగం నక్షత్రాలు తొలి 20 కోట్ల సంవత్సరాల్లోనే ఏర్పడ్డాయి.

ప్రస్తుతం అలకనంద ఎలా ఉంది?

ఈ ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పడం అసాధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలకనంద ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి వెలువడే కాంతి భూమిని చేరడానికి ఇంకా  1200 కోట్ల సంవత్సరాలు పడుతుంది.  ప్రస్తుతం అది ఎలా ఉందో తెలుసుకోవడం సాధ్యం కాదు.

ఖగోళ శాస్త్రంలో భారతీయుల ముద్ర

ఈ ఆవిష్కరణతో విశ్వం ప్రారంభ దశలోనే భారీ, క్రమబద్ధమైన సర్పిల గెలాక్సీలు ఏర్పడగలవని స్పష్టమైంది. దీంతో గెలాక్సీల పరిణామంపై ఉన్న సిద్ధాంతాలను శాస్త్రవేత్తలు పునఃపరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. ఆధునిక టెలిస్కోపుల నుంచి లభిస్తున్న సమాచారాన్ని సమర్థంగా విశ్లేషిస్తే ప్రపంచ స్థాయి ఖగోళ ఆవిష్కరణలు చేయడానికి భారీ పరిశోధనా కేంద్రాలే అవసరం లేదని, భారతీయ శాస్త్రవేత్తలు కూడా విశ్వ రహస్యాలను ఛేదించగలరని ఈ పరిశోధన మరోసారి నిరూపించింది.