ప్రపంచంలో ప్రస్తుతం 195 దేశాలు ఉన్నాయి. ప్రతి దేశం పేరు వెనుక ఒక ప్రత్యేక చరిత్ర ఉంటుంది. చాలా దేశాల పేర్లు పురాతన రాజ్యాలు, తెగలు లేదా ప్రాంతాల పేర్ల నుంచి వచ్చాయి. అయితే ఒక దేశం మాత్రం ఒక చెట్టు పేరు నుంచి వచ్చింది . ఆ దేశమే బ్రెజిల్.
దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్, ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యమైన అమెజాన్ అడవికి నిలయంగా ఉంది. దీని రాజధాని బ్రసీలియా (Brasília). ఈ దేశంలో 21.5 కోట్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు.
బ్రెజిల్‌కు ఈ పేరు ‘బ్రెజిల్‌వుడ్’ (Brazilwood) అనే చెట్టు వల్ల వచ్చింది. పోర్చుగీస్ భాషలో దీనిని ‘పౌ-బ్రాసిల్’ (Pau-brasil) అంటారు. 1500 సంవత్సరంలో పోర్చుగీస్ అన్వేషకులు ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు, ఈ చెట్లతో నిండిన అడవులను చూశారు.
ఈ చెట్టు కాండం లోపల భాగం ఎర్రటి నిప్పులా కనిపిస్తుంది. అందుకే పోర్చుగీస్ పదమైన ‘బ్రాసా’ (Brasa) నుంచి ‘బ్రెజిల్’ అనే పేరు వచ్చింది. ‘బ్రాసా’ అంటే మండే నిప్పు లేదా ఎర్రటి అగ్గిపుల్ల అని అర్థం. ఈ చెట్టు నుంచి లభించే ఎర్రటి రంగు (డై) యూరప్‌లో విలాసవంతమైన వస్త్రాలకు ఉపయోగించేవారు. దీంతో ఈ చెట్టు వ్యాపారం విస్తృతంగా పెరిగింది. క్రమంగా ఆ ప్రాంతాన్ని ప్రజలు దాని పాత పేరుతో కాకుండా ‘బ్రెజిల్’ అని పిలవడం ప్రారంభించారు. చివరకు అదే దేశానికి అధికారిక పేరుగా మారింది. ప్రపంచంలో ఒక చెట్టు పేరుతో పేరు పొందిన ఏకైక దేశం బ్రెజిల్ కావడం విశేషం.
