– భారీ నక్షత్రానికి దాగి ఉన్న సహచర నక్షత్రం గుర్తింపు
దశాబ్దాలుగా ఖగోళ శాస్త్రవేత్తలను అయోమయంలో పడేసిన బెటెల్జ్యూస్ అనే భారీ నక్షత్రం రహస్యానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన తాజా పరిశోధనలో బెటెల్జ్యూస్కు సమీపంలో ఒక మసకబారిన సహచర నక్షత్రం ఉన్నట్లు బలమైన ఆధారాలు లభించాయి.
ఈ ఆవిష్కరణను యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీకి చెందిన వెరీ లార్జ్ టెలిస్కోప్ సాయంతో నిర్వహించిన అత్యాధునిక పరిశీలనల ద్వారా సాధించారు. ఇప్పటివరకు బెటెల్జ్యూస్ వెలుగుకి కారణంగా కనిపించని ఈ చిన్న నక్షత్రాన్ని అధిక రిజల్యూషన్ చిత్రీకరణ సాంకేతికతతో గుర్తించారు.
భూమికి 550 కాంతి సంవత్సరాల దూరంలో ఒరియన్ నక్షత్రరాశిలో ఉన్న బెటెల్జ్యూస్, రాత్రి ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాల్లో ఒకటి. ఇది ఎర్రటి మహాకాయ నక్షత్రం (రెడ్ సూపర్‌జెయింట్). మరో కొన్ని మిలియన్ సంవత్సరాల్లో ఇది తన జీవితాన్ని ముగించి సూపర్నోవా పేలుడుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
బెటెల్జ్యూస్ ప్రకాశం మారుతూ ఉండటం చాలా కాలంగా శాస్త్రవేత్తలకు ఒక మిస్టరీగా ఉంది. సాధారణంగా ప్రతి 400 రోజులకు ఒకసారి నక్షత్రంలోని అంతర్గత కంపనాల వల్ల దాని ప్రకాశం మారుతుంది. అయితే అదనంగా ఆరు సంవత్సరాలకొకసారి కనిపించే మరో ప్రకాశం మార్పునకు ఇప్పటివరకు స్పష్టమైన కారణం తెలియలేదు.
తాజాగా గుర్తించిన సహచర నక్షత్రమే ఈ రహస్యానికి సమాధానమని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ నక్షత్రం సూర్యుడి కంటే 2.5 నుంచి 3 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన యువ ప్రధాన శ్రేణి నక్షత్రమని అంచనా వేశారు. ఇది బెటెల్జ్యూస్ చుట్టూ సుమారు ఆరు సంవత్సరాలకు ఒకసారి పూర్తి పరిభ్రమణం చేస్తోంది. ఇదే బెటెల్జ్యూస్ ప్రకాశంలో కనిపించే ఆరు సంవత్సరాల చక్రానికి కారణమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బెటెల్జ్యూస్ అత్యంత భారీగా, ప్రకాశవంతంగా ఉండటంతో దాని పక్కనే ఉన్న ఈ చిన్న నక్షత్రాన్ని ఇప్పటివరకు టెలిస్కోపులు గుర్తించలేకపోయాయి.
ఈ రెండు నక్షత్రాలు దగ్గరగా ఉండటంతో భవిష్యత్తులో బెటెల్జ్యూస్ మరింత విస్తరించి తన సహచర నక్షత్రాన్ని మింగివేసే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. మరోవైపు, అంతకుముందే బెటెల్జ్యూస్ సూపర్నోవాగా పేలిపోయే అవకాశాన్ని కూడా వారు కొట్టిపారేయడం లేదు. ఈ ఆవిష్కరణ బెటెల్జ్యూస్కు సంబంధించిన శతాబ్దకాల రహస్యాన్ని ఛేదించడమే కాకుండా, భారీ నక్షత్రాల పరిణామ క్రమంపై శాస్త్రవేత్తలకు మరింత అవగాహన కల్పించనుంది. అలాగే అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాల పక్కనే ఉన్న మసకబారిన ఖగోళ వస్తువులను కూడా ఆధునిక టెలిస్కోపులు గుర్తించగల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. భవిష్యత్ పరిశీలనల ద్వారా ఈ అరుదైన నక్షత్ర వ్యవస్థ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
