ముంబయి: కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఇంటి వద్ద 24 గంటలూ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ వారం రోజుల వ్యవధిలోనే ప్రధాన పార్టీల సోషల్ మీడియా సభ్యత్వాన్ని దాటి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో అతని ఇంటి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. నిరుద్యోగం, పరీక్ష పత్రాలను లీకేజీలు, విద్యాసంబంధ సమస్యలపై మీమ్స్, రాజకీయ వ్యాఖ్యానాల ద్వారా గత వారం సోషల్ మీడియాలో పురుడు పోసు కుంది కాక్రోచ్ జనతా పార్టీ. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇంటికి పోలీసులు రక్షణ కల్పించారు.
ఎం ఐ డి సిలోని వాలూజ్ ప్రాంతంలోని నివాసానికి తాము 24 గంటల సాధారణ పోలీసు భద్రతను కల్పించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అతుల్కర్ తెలిపారు. ఎటువంటి బెదిరింపులు దీనికి కారణం కాదని వివరించారు. ఇదిలా ఉండగా కాక్రోచ్ జనతా పార్టీకి పాకిస్తాన్, బిలియనీర్ జార్జ్ సోరస్ నెట్వర్క్ల నుంచి మద్దతు లభిస్తోందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. వీటిని అబిజిత్ ఖండించారు. మా పార్టీకి పాకిస్తాన్ తో సంబంధం లేదని, కేంద్రమంత్రి చేసిన ఆరోపణ నిరాధారమైనవి అన్నారు. పార్టీ ఉద్దేశం కేవలం భారతీయ సమస్యలు వినిపించడం యువతరానికి అవగాహన పెంచడమేనని స్పష్టం చేశారు. తమ పార్టీకి భారత్ లోనే 94% మంది ఫాలోవర్స్ ఉన్నారని తెలిపారు. పార్టీ డిజిటల్ ఉద్యమంపై విస్తృతమైన అణచివేత జరుగుతోందని తమ సోషల్ మీడియా ఖాతాలన్నింటిని, వెబ్ సైట్లను తొలగించారని లేదా హాక్ చేశారని అభిజిత్ ఆరోపించారు.
