విజయవాడ: పిల్లలు వారిలోని నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ లోని మదర్ థెరీసా పార్క్ ఏరియాలో మంత్రి సత్య ప్రసాద్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. పార్క్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ పేరాల అంకినీడు (316-h) ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ పిల్లలకు విద్య పరంగా, ఆటవిడుపుగా ఇలాంటి శిక్షణ శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
తాను ఇటీవల సింగపూర్లో పర్యటించానని అక్కడ ఆర్థికంగా వెనుకబడిన వారు ఉన్నతంగా ఉన్నవారు కలసిమెలసి ఒకచోటే జీవించేవారని తెలిపారు. ఇక్కడ కూడా ఇలాగే నివసించడం అభినందనీయమన్నారు. పిల్లల భవితకు కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్ మాట్లాడుతూ పిల్లలను ప్రోత్సహించడానికి వేసవిలో ఇలాంటి శిక్షణా శిబిరాలు నిర్వహించడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మనేని ప్రసాద్, ప్రేరేపిఈశ్వర్ నూతి శ్రీను, సొంఠి నాగేశ్వరరావు, గద్దె సత్యనారాయణ ప్రసాద్, తిమ్మాపురం సరోజ, దొంతినేని శ్రీనివాసన్, గూడూరు తేజస్విని, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

