శాస్త్రవేత్తల కొత్త సిద్ధాంతం ఆసక్తికరం
విశ్వంలో అత్యంత అభివృద్ధి చెందిన గ్రహాంతరవాసుల ఏలియన్స్ నాగరికతలు ఇప్పటికీ ఉన్నా కానీ వాటిని మనుషులు గుర్తించలేకపోతున్నారనే ఆసక్తికరమైన సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. దీనికి ప్రధాన కారణం వారి సాంకేతిక పరిజ్ఞానం మన ఊహకు అందని స్థాయికి చేరి ఉండొచ్చన్నదే.
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. అత్యున్నత స్థాయికి ఎదిగిన నాగరికతలు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత వ్యవస్థలపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. అలాంటి నాగరికతలు ఉపయోగించే సమాచార వ్యవస్థలు ప్రస్తుతం మనం వినియోగిస్తున్న రేడియో టెలిస్కోపులు లేదా ఇతర సంప్రదాయ పరికరాలతో గుర్తించలేనంత అధునాతనంగా ఉండొచ్చు. న్యూట్రినోలు, క్వాంటమ్ నెట్‌వర్క్‌లు లేదా ఇప్పటికీ పూర్తిగా అర్థం కాని ఇతర సాంకేతిక పద్ధతుల ద్వారా అవి సమాచారాన్ని పంపిస్తే, వాటి సంకేతాలను మన పరికరాలు గుర్తించడం దాదాపు అసాధ్యమని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ సిద్ధాంతం 1970లలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ ప్రతిపాదించిన ‘కమ్యూనికేషన్ హారైజన్’ భావనను మరోసారి గుర్తు చేస్తోంది. నాగరికతలు ఎంతగా అభివృద్ధి చెందుతాయో, వాటి సమాచార మార్పిడి పద్ధతులు మారిపోతాయని, ఒక దశ తర్వాత అవి ఇతర నాగరికతలకు కనిపించకపోవచ్చని ఆయన సూచించారు.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, అభివృద్ధి చెందిన నాగరికతలు పూర్తిగా AI ఆధారిత జీవన విధానానికి మారి ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వాటి కార్యకలాపాలు మనకు తెలిసిన రూపంలో ఎలాంటి ఆనవాళ్లను వదిలే అవకాశం ఉండకపోవచ్చని స్పష్టం చేశారు . అందుకే ప్రస్తుతం అనుసరిస్తున్న గ్రహాంతర జీవుల అన్వేషణ పద్ధతులను విస్తరించి, అసాధారణ సంకేతాలను గుర్తించే కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
AI ప్రభావాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా విశ్వంలో మేధో జీవుల అన్వేషణకు కొత్త దారులు తెరుచుకునే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో మరింత శక్తివంతమైన పరికరాలు, కొత్త గుర్తింపు విధానాలతో విశ్వంలో ఉన్న అధునాతన నాగరికతలను కనుగొనే అవకాశాలు మెరుగుపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
