ప్రపంచంలో అత్యంత స్నేహపూర్వక దేశాలు ఇవే

World

టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయిన భారత్

ప్రపంచ దేశాలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, ఆయా దేశాల పట్ల ఉన్న సానుకూల, ప్రతికూల దృక్పథాలను అంచనా వేస్తూ రూపొందించిన డెమోక్రసీ పర్సెప్షన్ ఇండెక్స్-2026 ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలకు చెందిన 46 వేల మందికిపైగా పాల్గొన్న ఈ సర్వేలో అత్యంత స్నేహపూర్వక, ఆదరణ పొందిన దేశాల జాబితాను విడుదల చేశారు. అయితే అతిథి దేవోభవ అనే గొప్ప సంస్కృతి కలిగిన భారత్ ఈ జాబితాలో టాప్-10లో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.

సర్వే ప్రకారం, స్విట్జర్లాండ్ , కెనడా దేశాలు +36 నెట్ పర్సెప్షన్ స్కోర్‌తో సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాయి. మర్యాద, పరస్పర గౌరవం, సామాజిక సమానత్వం, అతిథి సత్కారం వంటి అంశాల్లో ఈ దేశాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని సర్వే వెల్లడించింది.

 జపాన్ +34 నెట్ పర్సెప్షన్ స్కోర్‌తో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా అతిథులను గౌరవంగా చూసే ‘ఒమోటెనాషి’ సంస్కృతి జపాన్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. సేవా రంగంలోనూ, సామాజిక వ్యవహారాల్లోనూ మర్యాదకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టింది.

స్వీడన్ +33 స్కోర్‌తో తదుపరి స్థానంలో నిలిచింది. మర్యాదపూర్వక ప్రవర్తన, సంతోషకర జీవనశైలి, సామాజిక సంక్షేమ విధానాలు ఈ దేశానికి సానుకూల గుర్తింపును అందించాయి. +32 స్కోర్‌తో ఇటలీ, నార్వే దేశాలు తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. ఆహార సంస్కృతి, కుటుంబ బంధాలు, అతిథి మర్యాదలకు ప్రసిద్ధి చెందిన ఇటలీతో పాటు ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నార్వే కూడా ఈ జాబితాలో ముందంజలో నిలిచాయి.

స్పెయిన్ +31 స్కోర్‌తో మరో ప్రముఖ స్థానాన్ని దక్కించుకుంది. అక్కడి ప్రజల కలుపుగోలుతనం, స్నేహపూర్వక స్వభావం, సామాజిక జీవనశైలి ఈ ర్యాంకింగ్‌కు కారణమైనట్లు సర్వే పేర్కొంది. ఆస్ట్రేలియా, డెన్మార్క్, న్యూ జిలాండ్, ఫిన్లాండ్ దేశాలు +30 స్కోర్‌తో ఒకే స్థానాన్ని పంచుకున్నాయి.

ఇక భారత్ విషయానికి వస్తే, దేశానికి -2 నెట్ పర్సెప్షన్ స్కోర్ నమోదైంది. దీంతో సర్వేలో భారత్ సుమారు 28వ స్థానంలో నిలిచినట్లు వెల్లడైంది. ఈ స్కోర్‌కు గల కచ్చితమైన కారణాలను సర్వే నిర్వాహకులు వెల్లడించనప్పటికీ, భారతీయులు వ్యక్తిగత సంబంధాల్లో ఆతిథ్యాన్ని గొప్పగా భావించినప్పటికీ అపరిచితులతో అధికారిక మర్యాదపూర్వక సంభాషణలు తక్కువగా ఉండటం వంటి అంశాలు ప్రభావం చూపి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నెగెటివ్ స్కోర్ నమోదైన ఇతర దేశాల్లో సౌదీ అరేబియా (-1), కొలంబియా (-2), యెమెన్, బాంగ్లాదేశ్, లెబనాన్, క్యూబా, నైజీరియా (-3), వెనిజులా, మయాన్మార్, బెలారస్ (-5), పాకిస్తాన్ (-9) ఉన్నాయి. రష్యాకు -11 స్కోర్ నమోదైంది.

ఈ సర్వేలు ఒక సాధారణ ధోరణిని మాత్రమే ప్రతిబింబిస్తాయని, నిపుణులు చెప్తున్నారు.  140 కోట్లకు పైగా జనాభా కలిగిన భారతదేశం వంటి విభిన్న సంస్కృతులు, ప్రాంతాలు కలిగిన దేశాల గురించి సమగ్ర చిత్రాన్ని ఇవి చూపించలేకపోయి ఉండొచ్చని పేర్కొన్నారు.