నాడు నవ్వుల సిరి.. నేడు ఒంటరితనం మరి

Joint family f

-ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైతే.. మనిషి ఒంటరే
-ఒకే ఇంట్లో ఎన్నో మనసులు.. ఇప్పుడు ఒకే మనిషికి ఎన్నో బాధలు
-సౌకర్యాలు పెరిగాయి.. సాంత్వన ఇచ్చే మనుషులు తగ్గిపోయారు

గతంలో ఇంటి ముంగిట నవ్వులు వినిపించేవి. తాతయ్య చెప్పే కథలు, అమ్మమ్మ చేతి వంటలు, బాబాయిల సరదాలు, అత్తల ఆప్యాయత, పిల్లల అల్లరితో ఇల్లు ఒక చిన్న ప్రపంచంలా ఉండేది. సుఖమైనా.. దుఃఖమైనా.. పంచుకోవడానికి ఒక కుటుంబం ఉండేది. అదే ఉమ్మడి కుటుంబం. ప్రస్తుతం కాలం మారింది. ఉద్యోగాలు, చదువులు, నగర జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో కుటుంబాలు చిన్నవయ్యాయి. ఇళ్లు పెద్దవయ్యాయి కానీ మనసులు దూరమయ్యాయి. బంధాలు వాట్సాప్ సందేశాలకే పరిమితమయ్యాయి.

ఆనందం అంటే అప్పట్లో..
పండుగ అంటే ఇల్లంతా సందడి. సంక్రాంతి, దీపావళి, దసరా వంటి పండుగలకు అందరూ ఒకేచోట చేరేవారు. వంటింట్లో సందడి, ముంగిట ముగ్గులు, పిల్లల ఆటలు, పెద్దల ఆశీస్సులు.. ప్రతి క్షణం ఒక జ్ఞాపకంగా మిగిలేది. పిల్లలను పెంచేది కేవలం తల్లిదండ్రులు కాదు. తాతయ్యలు, అమ్మమ్మలు, బాబాయిలు, పిన్ని, అత్తలు.. అందరూ కలిసి ఉన్నత వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేవారు. అందుకే అప్పటి పిల్లల్లో బంధాల విలువ ఎక్కువగా ఉండేది.

ఇప్పుడు పరిస్థితి..
ఇప్పుడు నాలుగు గదుల ఇల్లు ఉంటుంది. కానీ మాట్లాడుకునే నలుగురు ఉండరు. తల్లిదండ్రులు ఉద్యోగాల్లో బిజీ. పిల్లలు మొబైల్ ప్రపంచంలో బిజీ. వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. అనారోగ్యం వచ్చినప్పుడు పక్కనే నిలబడే మనిషి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. చిన్న సమస్య కూడా పెద్ద భారం అవుతోంది. ఒకప్పుడు కుటుంబం పంచుకున్న బాధలను ఇప్పుడు ఒక్కరే మోస్తున్నారు.

వృద్ధుల బాధ ఎవరిది?
ఉమ్మడి కుటుంబాల్లో పెద్దలకు ఎంతో గౌరవం ఉండేది. వారి అనుభవమే ఇంటి దిక్సూచి. ఇప్పుడు చాలామంది వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారు. కొందరు వృద్ధాశ్రమాల్లో కాలం గడుపుతున్నారు. పిల్లలు విదేశాల్లో లేదా వేరే నగరాల్లో ఉండటంతో ప్రేమ ఉన్నా, తోడు ఉండడం కష్టమవుతోంది. వృద్ధులకు కావాల్సింది డబ్బు కాదు. పలకరించే మనిషి.. ప్రేమగా మాట్లాడే మనవడు.. పక్కన కూర్చునే కుటుంబ సభ్యుడు.

పిల్లలు కోల్పోతున్నది..
నేటి పిల్లలకు బంధుత్వాల గురించి తెలిసేది ఫొటోలు, వీడియో కాల్స్ ద్వారానే. బాబాయి, పిన్ని, మేనమామ, అత్త వంటి బంధాల ఆప్యాయతను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశాలు తగ్గుతున్నాయి. దీంతో పంచుకోవడం, సహనం, పెద్దలను గౌరవించడం, కలిసి జీవించడం వంటి విలువలు క్రమంగా తగ్గిపోతున్నాయని సామాజిక నిపుణులు చెబుతున్నారు.

సంపాదన పెరిగింది.. సంతోషం తగ్గింది
ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉంది. సొంత కారు ఉంది. మంచి జీతం ఉంది. కానీ మనసు విప్పి మాట్లాడుకునే కుటుంబం లేదు. డబ్బుతో కొనలేనిది అనుబంధం. ఆ అనుబంధమే నేడు కొరవడుతోంది.

మళ్లీ బంధాలను కలుపుకుందాం
ఉమ్మడి కుటుంబాలు మళ్లీ యథాతథంగా రావడం కష్టమే కావచ్చు. కానీ బంధాలను మాత్రం కాపాడుకోవచ్చు. నెలలో ఒకసారి కుటుంబమంతా కలవడం, పండుగలను కలిసి జరుపుకోవడం, పెద్దలకు సమయం కేటాయించడం, పిల్లలకు బంధాల విలువ చెప్పడం ద్వారా కుటుంబ అనుబంధాలను తిరిగి బలోపేతం చేయవచ్చు.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఇచ్చిన భద్రత, ప్రేమ, ఆప్యాయత, పరస్పర సహకారం ఏ ఆధునిక సౌకర్యమూ ఇవ్వలేకపోతోంది. ఇల్లు అంటే గోడలు కాదు.. మనుషులు. కుటుంబం అంటే రక్త సంబంధం కాదు.. ఒకరికి ఒకరు అండగా నిలిచే మనసులు. ఆ మనసులు నిలిస్తేనే సమాజం నిలుస్తుంది.