– ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం!
ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే ఎల్ నినో ఈసారి అసాధారణ తీవ్రతతో రూపుదిద్దుకుంటోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ఈ ఎల్ నినో, 1950 తర్వాత నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్ నినోగా నిలిచే అవకాశం ఉందని కంప్యూటర్ నమూనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే దీని ప్రభావం ప్రపంచంలోని అనేక ప్రాంతాల వాతావరణంలో కనిపించడం ప్రారంభమైంది.
ఎల్ నినో అంటే ఏమిటి?
ఎల్ నినో అనేది ఒక సహజ వాతావరణ చక్రం. ఇందులో మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా పెరుగుతుంది. వేడి వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది.
కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ, ప్రజారోగ్య పరిశోధకుడు జెఫ్రీ షామన్ అభిప్రాయం ప్రకారం గంట మోగిన తర్వాత ధ్వని తరంగాలు ఎలా వ్యాపిస్తాయో, అదే విధంగా సముద్రంలోని వేడి వాతావరణంలోకి వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతుంది. ఎల్ నినో తీవ్రతను పసిఫిక్ మహాసముద్రంలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో సముద్ర జలాల ఉష్ణోగ్రత ఎంత పెరిగిందనే ఆధారంగా అంచనా వేస్తారు.
ప్రపంచంపై ఎలాంటి ప్రభావం?
ఈసారి ఎల్ నినో కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలు తీవ్రమైన వాతావరణ మార్పులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో రాబోయే కాలంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. భారతదేశంలో నైరుతి రుతుపవనాలు (సమ్మర్ మాన్సూన్) సాధారణం కంటే బలహీనంగా ఉండే అవకాశం ఉంది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర అమెరికా ఉత్తర ప్రాంతాల్లో శీతాకాలం సాధారణం కంటే వెచ్చగా ఉండవచ్చు. దక్షిణ అమెరికా, అమెరికా దక్షిణ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అట్లాంటిక్ మహాసముద్రంలో హరికేన్‌ల సంఖ్య సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముంది.
ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులకు చేరే అవకాశం
అమెరికాలోని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ లో సీజనల్ క్లైమేట్ ఫోర్‌కాస్టింగ్ నిపుణుడు నాథనియెల్ జాన్సన్ ప్రకారం ఈసారి ఎల్ నినో చాలా బలంగా ఉండటంతో రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణాన్ని ప్రధానంగా ఇదే ప్రభావితం చేయనుంది. ఎల్ నినో ప్రభావంతో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2026, 2027 సంవత్సరాలు ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదయ్యే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే వరుసగా రెండు నెలలుగా ప్రపంచ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
ముందస్తు జాగ్రత్తలు అవసరం
వాతావరణ నిపుణులు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, రైతులు ముందుగానే సిద్ధం కావాలని సూచిస్తున్నారు. పట్టణాల్లో తీవ్ర వేడి, అధిక వర్షాలు, వేడి తరంగాలను ఎదుర్కొనే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి. రైతులు కరువు, వరదల అవకాశాలను దృష్టిలో ఉంచుకుని తగిన పంట రకాలను ఎంపిక చేసుకోవాలి. ఆహార భద్రత, నీటి వనరుల నిర్వహణపై ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఎల్ నినో సహజ ప్రక్రియ అయినప్పటికీ, వాతావరణ మార్పుల నేపథ్యంలో దీని ప్రభావం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
