ఛార్జింగ్‌ కోసం రోబో భిక్షాటన !

Robo

చైనాలో వైరల్‌ వీడియో 

ఛార్జింగ్ కోసం ఓ రోబో భిక్షాటన చేస్తున్న వింత ఘటన చైనా లో చోటు చేసుకుంది. ఇది  సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అత్యాధునిక హ్యూమనాయిడ్‌ రోబో ఒకటి ‘పవర్‌ రీఛార్జ్‌ చేసుకోవడానికి డబ్బులు లేవు’ అంటూ నడిరోడ్డుపై మోకాళ్లపై కూర్చుని భిక్షాటన చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో తొలుత కనిపించిన ఈ రోబో, ప్రముఖ రోబోటిక్స్‌ సంస్థ యూనిటరీ రోబోటిక్స్ రూపొందించిన ‘జీ1’  మోడల్‌గా గుర్తించారు. వీడియోలో  ఈ రోబో దీనంగా మోకాళ్లపై కూర్చుని రెండు చేతులు జోడించి  కనిపిస్తోంది. దాని ముందు విరాళాల కోసం ఒక ప్లేట్‌, డిజిటల్‌ చెల్లింపుల కోసం క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేశారు.

‘నన్ను నేను రీఛార్జ్‌ చేసుకోవడానికి డబ్బులు లేవు’, ‘పవర్‌ బిల్లుల కోసం దయచేసి సహాయం చేయండి’ అనే సందేశాలను లౌడ్‌స్పీకర్‌ ద్వారా నిరంతరం వినిపిస్తూ రోబో దృష్టిని ఆకర్షిస్తోంది. అటుగా వెళ్లే కొందరు డబ్బులు  వేయడం, మరికొందరు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి డబ్బులు పంపించడం వంటి దృశ్యాలు అందరినీ ఆకర్షిస్తోంది. 

సిచువాన్‌తో పాటు చెంగ్డూ, బీజింగ్‌, గ్వాంగ్‌జౌ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇలాంటి రోబోలు కనిపించడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. సుమారు 16 వేల డాలర్లు (దాదాపు రూ.13 లక్షలు) విలువ చేసే ఈ హ్యూమనాయిడ్‌ రోబోలు రోడ్లపై భిక్షాటన చేయడం చర్చనీయాంశమైంది.

వాస్తవానికి జీ1 రోబో అత్యాధునిక కృత్రిమ మేధస్సు, సమతుల్య కదలికలు, క్లిష్టమైన పనులు నిర్వహించే సామర్థ్యాలతో రూపొందించబడింది. ఇటీవల ఇదే మోడల్‌కు చెందిన ఒక రోబో ఈక్వెడార్‌లోని అగ్నిపర్వతాన్ని అధిరోహించడం ద్వారా తన సామర్థ్యాన్ని చాటుకుంది. అలాంటి రోబో ఇప్పుడు విరాళాలు అడగడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇక బిచ్చగాళ్ల స్థానాన్ని కూడా రోబోలే భర్తీ చేస్తాయా?’ అంటూ కొందరు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తుండగా, మరికొందరు దీనిని తెలివైన మార్కెటింగ్‌ వ్యూహంగా అభివర్ణిస్తున్నారు. ఇంకొందరు ఇది కళాత్మక ప్రదర్శన కావచ్చని, మరికొందరు ప్రజల దృష్టిని ఆకర్షించి నిధులు సమీకరించే కొత్త తరహా ప్రయోగమని అభిప్రాయపడుతున్నారు.

రోబో నిజంగా డబ్బులు అడుగుతోందా? లేక దాని వెనుక మానవ సృజనాత్మకత, ప్రచార వ్యూహం దాగి ఉందా? అన్న ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానం లభించలేదు. అయితే ఈ ‘భిక్షాటన రోబో’ మాత్రం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమైంది.