ఇంతకు సాబు వస్తువా ? మనిషా ? అసలు ఏంటిది ?
దాదాపు 90 ఏళ్ళ క్రితం ఈజిప్టులోని ఒక పురాతన సమాధిలో బయటపడిన ‘సాబు డిస్క్’ ఇప్పటికీ ప్రపంచంలోని రహస్యమైన పురా వస్తువుల్లో ఒకటిగా భావిస్తున్నారు. దీని ఆకారం విచిత్రంగా ఉండటంతో ఇది నిజంగా దేనికి ఉపయోగించారనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. కొందరు దీనిని అత్యాధునిక సాంకేతిక వస్తువుగా భావిస్తే, పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రం ఇది ఒక సాధారణ రాతి పాత్ర అని చెబుతున్నారు.
ఎక్కడ దొరికింది?
1936లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త వాల్టర్ ఎమెరీ ఈజిప్టులోని సక్కారా శ్మశానవాటికలో తవ్వకాలు నిర్వహించారు. అది సాబు (Sabu) అనే అధికారికి చెందిన సమాధి బయటపడింది. సాబు ఈజిప్టు మొదటి రాజవంశం కాలానికి చెందినవాడు. ఈ సమాధి సుమారు క్రీ.పూ. 3100 నుంచి క్రీ.పూ. 2900 మధ్యకాలంలో నిర్మించబడినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
సమాధిలో ఏం దొరికాయి ?
సాబు సమాధిని చాలా కాలం క్రితమే దొంగలు దోచుకున్నట్లు తెలిసింది. బంగారం, వెండి, ఆభరణాలు వంటి విలువైన వస్తువులు అప్పటికే కనిపించలేదు. అయితే సమాధిలో ఇంకా అనేక వస్తువులు మిగిలి ఉన్నాయి. వాటిల్లో చెక్కతో చేసిన శవపేటిక , సాబు అస్థిపంజరం, అనేక రాతి పాత్రలు, మట్టి పాత్రలు, చెకుముకి రాయి, రాగితో చేసిన పనిముట్లు, రెండు ఎద్దుల అవశేషాలు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సాబు డిస్క్ ఈ డిస్క్ పూర్తిగా కాకుండా పగిలి పోయిన ముక్కలుగా దొరికింది. తర్వాత శాస్త్రవేత్తలు ఆ ముక్కలన్నింటినీ కలిపి ఒక రూపానికి తెచ్చారు.
సాబు డిస్క్ ఎలా ఉంటుంది?
ఈ డిస్క్ వ్యాసం 61 సెంటీమీటర్లు (24 అంగుళాలు). దీని ఎత్తు 10 సెంటీమీటర్లు (3.9 అంగుళాలు). దీనిని మెటాసిల్ట్‌స్టోన్ అనే ప్రత్యేక రాతితో చెక్కారు. ఇది కొంత మార్పు చెందిన అవక్షేప శిల (Sedimentary Rock). ఈ డిస్క్‌లో మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. దాని చుట్టూ మూడు పలుచని వంపులు తిరిగిన రెక్కలలాంటి భాగాలు ఉంటాయి. పై నుంచి చూస్తే ఇది ఆధునిక కాలంలో ఉపయోగించే కారు చక్రం కవర్ విమాన ప్రొపెల్లర్ లేదా స్టీరింగ్ వీల్ లాగా కనిపిస్తుంది. ఇదే దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసింది.
ఎందుకు ఇంత చర్చ?
ఈ డిస్క్ ఆకారం చాలా ఆధునికంగా కనిపించడంతో దీనిపై ఎన్నో ఊహాగానాలు వెలువడ్డాయి. కొంతమంది ఇది నీటి టర్బైన్‌లో ఉపయోగించే భాగం (Water Turbine) అయి ఉండొచ్చని చెప్పారు. మరికొందరు ఇది ఎలియెన్స్ భూమిపై ఉపయోగించిన సాంకేతిక వస్తువు అయి ఉండవచ్చని వాదించారు. ఇటీవల మరో అభిప్రాయం కూడా వచ్చింది. ప్రాచీన ఈజిప్టులో బీరు తయారీలో ధాన్యాలు, వేడి నీటిని కలిపే ‘మాష్ టన్ ‘ అనే పాత్రగా దీనిని ఉపయోగించి ఉండవచ్చని కొందరు పరిశోధకులు సూచించారు.
శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
ఈ అన్ని ఊహాగానాలను పురావస్తు శాస్త్రవేత్తలు అంగీకరించడం లేదు. వారి అభిప్రాయం ప్రకారం, సాబు డిస్క్ కూడా ఆ కాలంలో ఉపయోగించిన ఇతర వెడల్పాటి రాతి పాత్రల మాదిరిగానే ఆహారం, నూనె లేదా ఇతర నైవేద్యాలను ఉంచడానికి తయారు చేసిన పాత్ర అయి ఉండే అవకాశమే ఎక్కువ. ఈ డిస్క్ తయారైన మెటాసిల్ట్‌స్టోన్ చాలా సున్నితమైన రాయి. అంతేకాకుండా దీనిపై చేసిన చెక్కుదల కూడా చాలా పలుచగా ఉంటుంది.
అందువల్ల దీనిని రోజూ ఉపయోగించే అవకాశం చాలా తక్కువ. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, దీనిని సాబు మరణించిన తర్వాత అతని సమాధిలో అంత్యక్రియల కానుక గా ఉంచారు. ప్రాచీన ఈజిప్టు ప్రజలు మరణం తర్వాత కూడా మరో ప్రపంచంలో జీవితం ఉంటుందని నమ్మేవారు. అందుకే ఆ ప్రపంచంలో ఉపయోగపడతాయని భావించి ఇలాంటి వస్తువులను సమాధుల్లో ఉంచేవారు. ప్రస్తుతం సాబు డిస్క్ ఈజిప్టు రాజధాని కైరోలోని ఈజిప్షియన్ మ్యూజియంలో (Egyptian Museum, Cairo) భద్రంగా ఉంచారు
