పరిణామ సిద్ధాంతం ఏం చెప్తోంది
మహిళలు సాధారణంగా పురుషుల కంటే ఎందుకు ఎక్కువ కాలం జీవిస్తారు? అనే ప్రశ్న తరతరాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సగటున మహిళల ఆయుష్షు పురుషుల కంటే ఐదు సంవత్సరాలు ఎక్కువ. యుద్ధాలు, మహమ్మారులు, సామాజిక మార్పులు వచ్చినా ఈ వ్యత్యాసం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు సైన్స్ అడ్వాన్సస్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అంతర్జాతీయ అధ్యయనం ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన స మాధానాన్ని అందించింది. ఈ పరిశోధనకు డెన్మార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ డెన్మార్క్ కు చెందిన శాస్త్రవేత్త జోహన్నా స్టార్క్ నేతృత్వం వహించారు.
1,176 జంతు జాతులపై అధ్యయనం
శాస్త్రవేత్తలు అడవుల్లో, జంతుప్రదర్శనశాలల్లో జీవిస్తున్న మొత్తం 528 క్షీరద జాతులు , 648 పక్షి జాతులు జీవితకాల వివరాలను విశ్లేషించారు. వారి పరిశోధనలో తేలిన ముఖ్యమైన విషయం మిటంటే, ఆడ-మగ మధ్య ఆయుష్షులో కనిపించే తేడా యాదృచ్ఛికం కాదు. అది పరిణామ క్రమంలో ఏర్పడిన జీవశాస్త్ర సంబంధిత లక్షణం. పరిశోధనల ప్రకారం క్షీరదాల్లో ఆడ జంతువులు మగ జంతువుల కంటే సగటున 12–13 శాతం ఎక్కువ కాలం జీవిస్తాయి. అయితే పక్షుల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. అక్కడ మగ పక్షులు ఆడ పక్షుల కంటే సుమారు 5 శాతం ఎక్కువకాలం జీవిస్తాయి.ఈ తేడాకు ఆహారం, శరీర పరిమాణం, జీవనశైలి కారణాలు కావని పరిశోధకులు గుర్తించారు . అసలు కారణం జన్యు నిర్మాణం (Genetic Architecture), పునరుత్పత్తి విధానం (Reproductive Strategy) అని పేర్కొన్నారు.
క్రోమోజోమ్‌లే కీలకం
క్షీరదాల్లో ఆడ జంతువులకు రెండు X క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఒక X క్రోమోజోమ్‌లో లోపం ఉన్నా, మరో X దాన్ని భర్తీ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని పరిశోధకులు ‘జన్యు భద్రతా వలయం’ గా పేర్కొన్నారు. మగ జంతువులకు ఒక X, ఒక Y మాత్రమే ఉండటంతో ఆ రక్షణ ఉండదు. అందువల్ల హానికర జన్యు మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పక్షుల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ ఆడ పక్షులకు ZW, మగ పక్షులకు ZZ క్రోమోజోమ్‌లు ఉంటాయి. అందువల్ల పక్షుల్లో మగవారే జన్యుపరంగా ఎక్కువ రక్షణ పొందుతారు. జంతువులు అడవిలో వేట, వ్యాధుల ముప్పును ఎదుర్కొంటాయి. అందుకే ఆయుష్షు తగ్గుతుందనుకోవచ్చు. కానీ జూలో భద్రంగా జీవించే జంతువులపై కూడా ఇదే నమూనా కనిపించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల పర్యావరణం కంటే జీవశాస్త్రమే ఈ తేడాకు ప్రధాన కారణమని వారు స్పష్టం చేశారు.
జత కోసం పోరాటం కూడా ఆయుష్షును తగ్గిస్తుంది
క్షీరదాల్లో మగ జంతువులు జతను సంపాదించుకోవడానికి పోటీ పడతాయి. సింహాలు, జింకలు వంటి జాతుల్లో ఆధిపత్యం కోసం పోరాటాలు, శక్తి ప్రదర్శనలు, భూభాగాన్ని కాపాడుకోవడం వంటి చర్యల్లో విపరీతమైన శక్తి ఖర్చవుతుంది. ఈ పోటీ వల్ల గాయాలు, ఒత్తిడి, శరీరంపై అదనపు భారం పెరిగి వృద్ధాప్యం వేగంగా వస్తుంది. అందుకే పునరుత్పత్తిలో విజయం సాధించడానికే ప్రకృతి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది కానీ ఎక్కువకాలం జీవించడానికి కాదు అని పరిశోధకులు తెలిపారు.
పక్షుల్లో ఎందుకు మగవి ఎక్కువకాలం జీవిస్తాయి?
చాలా పక్షి జాతులు ఒకే జతతో జీవితాన్ని గడుపుతాయి. పిల్లల సంరక్షణ బాధ్యతను కూడా మగ, ఆడ రెండూ పంచుకుంటాయి. పోటీ తక్కువగా ఉండటంతో మగ పక్షులు ఎక్కువకాలం జీవిస్తాయి. ఈగిల్స్, గుడ్లగూబలు వంటి కొన్ని వేట పక్షుల్లో ఆడ పక్షులే పెద్దవిగా, ఆధిపత్యం కలిగినవిగా ఉండటంతో అక్కడ పరిస్థితి మళ్లీ మారుతుంది. చాలా జంతు జాతుల్లో పిల్లల సంరక్షణ బాధ్యత ఎక్కువగా ఆడ జంతువులపైనే ఉంటుంది. ముఖ్యంగా (ప్రైమేట్స్) కోతులు, చింపాంజీలు, మనుషులు లో తల్లుల జీవితం ఎక్కువకాలం ఉండడం వల్ల పిల్లల మనుగడకు ఉపయోగపడుతుంది. అందువల్ల పరిణామ క్రమంలో ఆడ జంతువులు ఎక్కువకాలం జీవించే లక్షణం అభివృద్ధి చెందినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
రోగనిరోధక శక్తిలో కూడా తేడా
ఆడ క్షీరదాల్లో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. అందువల్ల అంటువ్యాధులను ఎదుర్కోగలుగుతాయి. దీనివల్ల ఆటోఇమ్యూన్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.మగ జంతువుల్లో రోగనిరోధక శక్తి కొంత బలహీనంగా ఉండటంతో అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిణామ లక్షణం ఏనుగుల నుంచి మనుషుల వరకు అనేక క్షీరద జాతుల్లో కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ మహిళల సగటు ఆయుష్షు పురుషుల కంటే ఎక్కువగా ఉంది. ఉదాహరణకు, స్వీడన్‌లో 18వ శతాబ్దంలో ఈ వ్యత్యాసం సుమారు రెండేళ్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం అది ఐదేళ్లకు పైగా పెరిగింది. దీనికి తల్లుల మరణాల తగ్గుదల, వైద్యసేవల మెరుగుదల, పురుషుల్లో అకాల మరణాల తగ్గుదల వంటి కారణాలు కూడా తోడయ్యాయి.
