బతుకు పాఠశాల

Humal life

వయసు చెప్పే ఐదు కఠిన నిజాలు!
కాలం నేర్పే పాఠాలు ముందే తెలుసుకుంటే.. జీవితమే మారిపోతుంది

జీవితం ఎప్పుడూ ప్రణాళికల ప్రకారం సాగదు. ఎన్నో కలలు, ఆశలు, లక్ష్యాలతో పరుగులు తీస్తూ ఉంటాం. ‘ఇంకొంత సంపాదించిన తర్వాత ప్రశాంతంగా జీవిద్దాం’, ‘రిటైర్మెంట్ తర్వాత కుటుంబంతో సమయం గడుపుదాం’, ‘ఈ పని పూర్తయిన తర్వాత ఆరోగ్యంపై దృష్టి పెడదాం’ అంటూ జీవితాన్నే వాయిదా వేస్తుంటాం. కాలం మాత్రం ఎవరి కోసం ఆగదు. ఒక దశ దాటాక వెనక్కి తిరిగి చూసినప్పుడు.. కొన్ని అవకాశాలు, మనుషులు, క్షణాలు తిరిగి రావని అర్థమవుతుంది. జీవితంలో చాలామంది ఆలస్యంగా గ్రహించే ఐదు నిజాలు ఇవే.

సమయం.. మనం అనుకున్నంత మనది కాదు!
‘రేపు’ కోసం బతికితే..’ఈరోజు’ చేతులెత్తేస్తుంది. చాలామంది జీవితంలో చేసే పెద్ద పొరపాటు ‘ఇంకా చాలా సమయం ఉంది’ అని అనుకోవడమే. చేయాలనుకున్న పనులను, కలలను, ఇష్టాలను పదేపదే వాయిదా వేస్తుంటారు. కానీ ప్రతి రోజు గడుస్తున్న కొద్దీ మన జీవితంలోని ఒక పేజీ శాశ్వతంగా మూసుకుపోతుంది. కాలం విలువను గుర్తించినవారే జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఎదగడం ఎంత ముఖ్యమో.. ఈరోజును ఆనందంగా జీవించడం కూడా అంతే ముఖ్యం.

మనుషులు శాశ్వతం కాదు.. బంధాలే అసలైన సంపద
చెప్పాల్సిన ప్రేమను.. రేపటికి వాయిదా వేయొద్దు. జీవితంలో మనతో నడిచే ప్రతి వ్యక్తి ఎప్పటికీ మనతో ఉంటారని ఎవరూ హామీ ఇవ్వలేరు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, స్నేహితులు.. వీరందరితో గడిపే ప్రతి క్షణం అమూల్యమైనదే. బిజీ జీవితంలో ‘తర్వాత మాట్లాడదాం’ అని వదిలేసిన మాటలు.. ఒకరోజు జీవితాంతం మిగిలే పశ్చాత్తాపంగా మారొచ్చు. అందుకే ప్రేమను, కృతజ్ఞతను, అభిమానాన్ని ఉన్నప్పుడే వ్యక్తం చేయాలి.

డబ్బు సంపాదించవచ్చు.. ఆరోగ్యాన్ని కాదు
డబ్బు కోసం పగలు రాత్రి కష్టపడటం తప్పు కాదు. కానీ ఆ ప్రయాణంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం పెద్ద తప్పు. నిద్ర లేకుండా పనిచేయడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామాన్ని విస్మరించడం..ఇవన్నీ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించే పరిస్థితి తీసుకొస్తాయి. సంపాదించిన సంపదను ఆస్వాదించాలంటే ముందు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం కోల్పోయాక డబ్బు కూడా చాలాసార్లు ఏమీ చేయలేకపోతుంది.

ఈరోజు పెద్దగా కనిపించే సమస్యలు.. రేపటికి చిన్న జ్ఞాపకాలే
ఈరోజు మనల్ని తీవ్రంగా కలవరపెడుతున్న సమస్యలు, కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి చూసినప్పుడు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, అపార్థాలు.. ఇవన్నీ జీవితంలో భాగమే. సమస్యలు శాశ్వతం కావు. వాటి కోసం మన ప్రశాంతతను, ఆరోగ్యాన్ని త్యాగం చేయడం మాత్రం సరైన నిర్ణయం కాదు.

కష్టకాలంలో తోడుండేవారే.. నిజమైన మనుషులు
విజయం వచ్చినప్పుడు అభినందించే వాళ్లు ఎందరో ఉంటారు. కానీ ఓటమి ఎదురైనప్పుడు భుజం తట్టి ‘నేనున్నాను’ అని చెప్పేవారే అసలైన బంధువులు, నిజమైన స్నేహితులు. జీవితంలో అలాంటి వ్యక్తులను కోల్పోవద్దు. అదే సమయంలో, ఇతరులకు అవసరమైనప్పుడు తోడుగా నిలబడే మనిషిగా మారడం కూడా అంతే గొప్ప విషయం.

  • జీవితానికి చివర్లో ఎక్కువగా బాధపెట్టేవి ఇవే.
    చేయాలనుకుని చేయలేకపోయిన పనులు.
    చెప్పాలనుకుని చెప్పని మాటలు.
    గడపాల్సిన వాళ్లతో గడపని సమయం.
    నిర్లక్ష్యం చేసిన ఆరోగ్యం.
    విలువ ఇవ్వని బంధాలు.
    ఇవి తిరిగి కొనుక్కోలేని సంపదలు.

కాలాన్ని గెలిచేది డబ్బు కాదు.. జీవించిన తీరు
జీవితం పొడవుగా ఉండకపోవచ్చు. కానీ అర్థవంతంగా మాత్రం ఉండొచ్చు. మనిషి సంపాదించిన ఆస్తి కంటే.. సంపాదించిన మనుషులు, గడిపిన క్షణాలు, చేసిన మంచి పనులే చివరకు గుర్తుండిపోతాయి. గతం నుంచి పాఠాలు నేర్చుకోండి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోండి. కానీ ఈరోజును మాత్రం కోల్పోవద్దు.
ఎందుకంటే.. జీవితంలో అత్యంత విలువైన సమయం ‘ఒకరోజు’ కాదు.. ‘ఈరోజు’.