‘నీ చేతిలో అదృష్ట రేఖ లేదు’ ‘నీ జాతకం అంత గొప్పగా లేదు’ ‘నీ వల్ల అది సాధ్యం కాదు’ ఈ మాటలు విన్న వెంటనే చాలామంది కలలు కట్టిన భవనాన్ని వాళ్లే కూల్చేస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించండి… చేతిలోని గీతలు ఎప్పుడైనా పొలం దున్నాయా? పరీక్ష పాస్ చేశాయా? వ్యాపారం నిలబెట్టాయా? కుటుంబాన్ని గెలిపించాయా?
గెలుపు గీతల్లో ఉండదు.. గుండెల్లో మండే తపనలో ఉంటుంది.
అరచేతిలోని రేఖలు పుట్టుకతో వస్తాయి. విజయానికి దారితీసే రేఖలు ప్రతిరోజూ చేసే కష్టంతో ఏర్పడతాయి. చెమటతో తడిసిన చేతులకు జ్యోతిష్యం అవసరం ఉండదు. అవే తమ భవిష్యత్తును తామే రాసుకుంటాయి. మనిషిని వెనక్కి లాగేది విధి కాదు.. ‘నీ వల్ల కాదు’ అని చెప్పే నాలుకలు. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. ఆ మాటలను నిజమని నమ్మే మనసు.
చేతకాని వాళ్ల సలహా వినడం అంటే.. ఎగరలేని పక్షిని చూసి ఆకాశానికి భయపడినట్టే
గింజను చూసి ‘ఇది చెట్టు కాదు’ అని నవ్వేవాళ్లు చాలామంది ఉంటారు. అదే గింజ నేలను నమ్మి నిలబడితే, ఒక రోజు అదే చెట్టు నీడలో వాళ్లే నిలబడాల్సి వస్తుంది. జీవితంలో గుర్తుంచుకోవాల్సిన ఒక నిజం ఉంది. ఓడిపోయినవాళ్లు ఎక్కువగా కారణాలు చెబుతారు. గెలిచినవాళ్లు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు.
కారణాలు విధిని నమ్ముతాయి.. ప్రయత్నాలు విజయాన్ని నమ్ముతాయి
ఎవరో చెప్పిన మాటలతో నీ ప్రయాణాన్ని ఆపేస్తే, నీ కథకు రచయిత నువ్వు కాదు. నీ భవిష్యత్తు గురించి తీర్పు చెప్పే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎందుకంటే నీ సామర్థ్యాన్ని నీకంటే బాగా ఎవరూ తెలుసుకోలేరు. అదృష్టం కోసం ఎదురుచూసే గడియారం ఎప్పుడూ నెమ్మదిగానే తిరుగుతుంది. కానీ లక్ష్యం కోసం పరుగెత్తే అడుగులు కాలాన్నే దాటిపోతాయి.
రేఖలు దారి చూపవు… నిర్ణయాలే దారి చూపిస్తాయి
అందుకే చేతిని జ్యోతిష్కుడి ముందు చాపే ముందు… పనిలోకి చాపు. ఫలితం మారిపోతుంది. నీ చెమట చుక్కలు ఎండిపోయేలోపు, నీ గురించి సందేహపడిన వాళ్ల మాటలు కూడా ఎండిపోతాయి.
చివరిగా ఒక మాట ..
చేతికున్న గీతలు నీ జీవితాన్ని రాయవు
చేతల్లోని కష్టం రాస్తుంది
చేతకాని వాళ్ల మాటలు నీ విలువను నిర్ణయించవు
నువ్వు సాధించిన ఫలితాలే నీ గుర్తింపు
కాబట్టి గీతలను మర్చిపో.. గమ్యాన్ని గుర్తుపెట్టుకో
మాటలను వదిలేయ్.. అడుగులను వేగంగా వేయ్
ఒక రోజు నీ విజయమే, నిన్ను తక్కువ అంచనా వేసిన ప్రతి మాటకు సమాధానం చెబుతుంది
