డిజిటల్ మాయలో పడి ‘మనుషులను’ దూరం చేసుకోకండి
కాకినాడలోని వాసు తెల్లారి లేస్తే చేతిలో ఫోన్ ఉంటుంది. అదే లోకంగా గడుపుతుంటాడు. దీంతో వాసు, అతని భార్య మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇలాంటి ఘటనలు అన్ని చోట్ల తారసపడుతున్నాయి.
డిజిటల్ మాయలో పడి మనుషులను దూరం చేసుకుంటున్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు మన చేతుల్లో మొబైల్ ఫోన్ లేకపోతే క్షణం గడవదు. ఒకప్పుడు కేవలం సమాచార మార్పిడికి మాత్రమే పరిమితమైన ఈ పరికరం, ప్రస్తుత ప్రపంచంలో మనిషిని తన అదుపులో ఉంచుకునే వ్యసనంగా మారిపోయింది. ఈ ‘స్మార్ట్’ విప్లవం మనకు సౌకర్యాలను తెచ్చిపెట్టిన మాట వాస్తవమే. అయినా దాని వెనుక ఉన్న చీకటి కోణం మన జీవితాలను నిశ్శబ్దంగా నాశనం చేస్తోంది. మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూ, బంధాల్లోని మాధుర్యాన్ని ఈ స్క్రీన్లు మింగేస్తున్నాయి. ఈ డిజిటల్ మాయాజాలంతో వ్యక్తిగత, సామాజిక జీవితాలు ఎలా దెబ్బతింటున్నాయో ఓసారి లోతుగా పరిశీలన చేద్దాం.
‘సమీప’ దూరాలు
సాంకేతికత ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్‌గా మార్చిందని సంబరపడుతున్నాం. ఒకే ఇంట్లో ఉండే మనుషుల మధ్య మాత్రం మైళ్ళ దూరాన్ని పెంచేసింది. ఒకప్పుడు సాయంత్రం అయితే కుటుంబ సభ్యులు అంతా ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు రూమ్‌లో నలుగురు ఉన్నా… ఎవరి ఫోన్ ప్రపంచంలో వారు మునిగిపోతున్నారు. పక్కనే ఉన్న కన్నవారిని, పిల్లలను పలకరించే తీరిక కూడా ఉండటం లేదు. ఎక్కడో ఉన్న సోషల్ మీడియా స్నేహితుల లైక్‌లు, కామెంట్ల కోసం గంటల కొద్దీ ఎదురుచూస్తున్నారు. ఇది మనుషుల మధ్య భౌతిక సామీప్యతను ఉంచి, మానసిక బంధాలను తెంచేస్తోంది.
సోషల్ మీడియా రచ్చ
మొబైల్ మితిమీరిన వాడకంతో నేడు అనేక కాపురాల్లో చిచ్చు పెడుతోంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ‘క్వాలిటీ టైమ్’ (నాణ్యమైన సమయం) ను ఈ ఫోన్లు లాగేసుకుంటున్నాయి. భాగస్వామి కంటే మొబైల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో అనుమానాలు, కలహాలు పెరిగి విడాకుల వరకు దారితీస్తున్నాయి. అంతేకాదు, ఒకప్పుడు నాలుగు గోడలకే పరిమితం కావాల్సిన దంపతుల వ్యక్తిగత విషయాలు, భావోద్వేగాలు నేడు రీల్స్ రూపంలోనో, స్టేటస్‌ల రూపంలోనో సోషల్ మీడియా ఎక్కి నవ్వులపాలవుతున్నాయి.
జేబులోకి చేరిన ప్రపంచం.. జారిపోయిన జ్ఞాపకాలు
- స్మార్ట్ ఫోన్ రాకతో మన నిత్యజీవితంలో భాగమైన ఎన్నో అద్భుతమైన వస్తువులు కాలగర్భంలో కలిసిపోయాయి.
- అందమైన గోడ గడియారాలు, చేతి గడియారాలు
- లెక్కలు కట్టే క్యాలిక్యులేటర్లు
- పాటలు, వార్తలు వినిపించే రేడియోలు
- జ్ఞాపకాలను భద్రపరిచే కెమెరాలు, డైరీలు
ఇవన్నీ ఇప్పుడు ఒక చిన్న స్క్రీన్ లోపల బందీ అయిపోయాయి. ఇదంతా ఒక రకంగా సౌకర్యంగా అనిపించినా… మనిషిని శారీరకంగా, మానసికంగా తీవ్ర బద్ధకస్తుడిగా మార్చేసింది.
అదృశ్య శత్రువులు
మొబైల్ వాడకం పెరిగిన కొద్దీ సైబర్ నేరగాళ్లకు మన జేబులు గుల్ల చేయడం సులువైపోయింది. ఒక చిన్న తప్పుడు లింక్ నొక్కడం లేదా ఓటీపీ (OTP) చెప్పడంతో జీవితకాల సంపాదన క్షణాల్లో ఆవిరైపోతోంది. మనకు తెలియకుండానే రకరకాల యాప్స్ ద్వారా మన వ్యక్తిగత ఫోటోలు, లొకేషన్లు, డేటా చోరీకి గురవుతున్నాయి. సోషల్ మీడియాలో అపరిచితులతో స్నేహం ప్రాణాంతకంగా మారుతోంది. ఆపై బ్లాక్‌మెయిలింగ్, హ్యాకింగ్ వంటి దారుణాలు నిత్యకృత్యంగా మారాయి.
ఆరోగ్యంపై ‘డిజిటల్’ దెబ్బ
అతిగా మొబైల్ స్క్రీన్ వైపు చూడటంతో మన శరీరం రోగాల నిలయంగా మారుతోంది.
నిద్రలేమి (Insomnia): రాత్రిపూట ఫోన్ల నుంచి వచ్చే ‘బ్లూ లైట్’ నిద్రను కలిగించే మెలటోనిన్ హార్మోన్‌ను దెబ్బతీస్తుంది.
మానసిక ఒత్తిడి: ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఇతరుల కృత్రిమ జీవితాలతో మనల్ని మనం పోల్చుకుంటూ యువత తీవ్రమైన డిప్రెషన్‌కు లోనవుతున్నారు.
శారీరక రుగ్మతలు: గంటల తరబడి వంగి ఫోన్ చూడటం వల్ల ‘టెక్స్ట్ నెక్ సిండ్రోమ్’ (మెడ నొప్పి), కంటి చూపు మందగించడం, ఊబకాయం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి.
బానిసలుగా వద్దు.. యజమానులుగా ఉందాం!
సాంకేతికత అనేది మన అవసరాలను తీర్చే ఒక అద్భుతమైన సాధనం మాత్రమే కావాలి.. కానీ మన జీవితాలను శాసించే యజమాని కాకూడదు. అమృతం కూడా హద్దులు దాటితే విషమవుతుంది. రోజులో కొంత సమయాన్ని ‘డిజిటల్ డిటాక్స్’(మొబైల్‌కు దూరం) గా ప్రకటిద్దాం. స్క్రీన్ వైపు చూడటం ఆపి, పక్కనున్న మనుషుల కళ్లల్లోకి చూసి మాట్లాడుదాం. ఎందుకంటే నెట్‌వర్క్ కనెక్టివిటీ కంటే మనసుల బంధమే శాశ్వతం!
