– శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?
ఒకప్పుడు పెద్దవారైన తర్వాత మెదడులో కొత్త నాడీకణాలు (న్యూరాన్లు) ఏర్పడవని, జీవితాంతం ఉన్న కణాలతోనే మెదడు పనిచేస్తుందని భావించేవారు. టెక్స్ట్ బుక్స్ లో కూడా ఇదే విషయాన్ని బోధించేవారు. అయితే ఆధునిక న్యూరోసైన్స్ పరిశోధనలు ఈ అభిప్రాయాన్ని తప్పుబడుతున్నాయి.
పరిశోధనల ప్రకారం, పెద్దవారిలో కూడా కొన్ని పరిస్థితుల్లో కొత్త న్యూరాన్లు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హిప్పోక్యాంపస్ అనే మెదడు భాగంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. జ్ఞాపకశక్తి, కొత్త విషయాలను నేర్చుకోవడం, భావోద్వేగాలను నియంత్రించడం వంటి కీలక పనుల్లో హిప్పోక్యాంపస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
వయస్సు పెరిగేకొద్దీ నాడీకణాల సంఖ్య తగ్గడం, వాటి మధ్య సంబంధాలు బలహీనపడడం, మెదడు కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం తగ్గడం వల్ల జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. దీంతో అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
వ్యాయామం మెదడుకు ఎలా ఉపయోగపడుతుంది?
వ్యాయామం చేసే సమయంలో శరీరంలో బ్రెయిన్ డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (BDNF) అనే ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. దీనిని శాస్త్రవేత్తలు ‘మెదడుకు ఎరువు’గా అభివర్ణిస్తారు. ఈ ప్రోటీన్ కొత్త నాడీకణాల పెరుగుదలకు సహాయపడటంతో పాటు, నాడీకణాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. అలాగే ఇప్పటికే ఉన్న కణాలు ఆరోగ్యంగా పనిచేయడానికి కూడా దోహదపడుతుంది. హిప్పోక్యాంపస్‌లో కొత్త న్యూరాన్లు ఏర్పడటంలో BDNF కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఏ వ్యాయామం ఎక్కువ ప్రయోజనకరం?
న్యూరాలజీ నిపుణుడు డాక్టర్ రాబర్ట్ డబ్ల్యూ. బి. లవ్ తెలిపిన వివరాల ప్రకారం, అన్ని రకాల వ్యాయామాలు ఒకే విధమైన ప్రయోజనం ఇవ్వవు. ఇటీవల జరిగిన న్యూరాలజీ సదస్సులో డాక్టర్ ఆస్టిన్ పెర్ల్‌మట్టర్ సమర్పించిన అధ్యయనాల ప్రకారం, రెసిస్టెన్స్ ట్రైనింగ్ (బరువులు ఎత్తడం, బాడీ వెయిట్ వ్యాయామాలు, స్క్వాట్స్, పుష్-అప్స్ వంటివి) కొన్ని సందర్భాల్లో సాధారణ ఏరోబిక్ వ్యాయామాల కంటే ఎక్కువగా BDNF ఉత్పత్తిని ప్రేరేపించే అవకాశం ఉందని వెల్లడైంది. ప్రత్యేకించి వృద్ధుల్లో, అల్జీమర్స్ ప్రమాదం ఉన్నవారిలో రెసిస్టెన్స్ ట్రైనింగ్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరింత ఉపయోగకరంగా ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
2023లో ప్రచురితమైన ఒక సమీక్ష అధ్యయనం ప్రకారం, రెసిస్టెన్స్ ట్రైనింగ్ మనుషుల్లో BDNF స్థాయిలను గణనీయంగా పెంచుతుందని గుర్తించారు. అయితే వ్యాయామ తీవ్రత, వ్యవధి, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి ఫలితాల్లో తేడాలు ఉండవచ్చన్నారు.
అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించవచ్చా?
అధిక స్థాయిలో బ్రెయిన్ డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ ఉండటం వల్ల అల్జీమర్స్ వచ్చే ప్రమాదం తగ్గే అవకాశం ఉందని, జ్ఞాపకశక్తి క్షీణత నెమ్మదించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఇది అల్జీమర్స్‌కు ప్రత్యక్ష చికిత్స కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అయినప్పటికీ, క్రమం తప్పకుండా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయడం ద్వారా మెదడులో వాపు తగ్గడం, నాడీకణాల మనుగడ మెరుగుపడటం, హిప్పోక్యాంపస్ పరిమాణాన్ని కాపాడటం వంటి ప్రయోజనాలు లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందువల్ల ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మెదడు ఆరోగ్యానికి కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
