- గొడవల మధ్యే బలపడే బంధం
- ఉన్నప్పుడే గుర్తిస్తేనే జీవిత భాగస్వామి విలువ
- దాంపత్యం.. ఇద్దరు మనుషుల మధ్య కాదు, రెండు మనసుల మధ్య ఒప్పందం
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కనిపించే చిరునవ్వుల ఫొటోలే దాంపత్యానికి గుర్తుగా ఉంటున్నాయి. నిజమైన దాంపత్యం కెమెరా ముందు కనిపించే నవ్వుల్లో కాదు.. రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న విభేదాలను దాటుకుని తిరిగి ఒకరి చేయి మరొకరు పట్టుకోవడంలో ఉంటుంది. ఒకే ఇంట్లో నివసించే ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించకపోయినా, ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగడమే దాంపత్యానికి అసలైన నిర్వచనం.
ప్రతి కుటుంబంలో అభిప్రాయ భేదాలు సహజం. కొన్నిసార్లు మాటలు కఠినంగా మారవచ్చు. మౌనం రోజుల తరబడి కొనసాగవచ్చు. ఆ కోపం వెనుక దాగి ఉండేది ప్రేమే. బయటకు కనిపించని ఆప్యాయతే కుటుంబాన్ని నిలబెడుతుంది. భార్య ఆలస్యంగా వచ్చిన భర్త కోసం ఎదురుచూడడం, భర్త తన కోపాన్ని పక్కనపెట్టి భార్య ఆరోగ్యం గురించి ఆరా తీయడం.. ఇవే నిజమైన అనుబంధానికి నిదర్శనాలు.
పిల్లలు వెళ్లిపోయాక తెలుస్తుంది అసలు బంధం
పిల్లలు చిన్నగా ఉన్నంత వరకు వారి చుట్టూనే తల్లిదండ్రుల ప్రపంచం తిరుగుతుంది. చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు.. ఇలా కాలం గడిచిపోతుంది. తర్వాత పిల్లలు జీవితాల్లో స్థిరపడతారు. అప్పుడు ఇంట్లో ఉండేది భార్యాభర్తలే. ఆ సమయంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండే మనసే దాంపత్య బంధం ఎంత గొప్పదో గుర్తు చేస్తుంది.
ఒకప్పుడు చిరాకుగా అనిపించిన అలవాట్లే, ఒకరోజు కనిపించకపోతే జీవితంలో పెద్ద వెలితిగా మారుతాయి. ప్రతిరోజూ వినిపించే స్వరం ఒకరోజు వినిపించకపోతే బాధగా అనిపిస్తుంది. అందుకే జీవిత భాగస్వామి విలువ వారు దూరమైన తర్వాత కాదు.. వారు మనతో ఉన్నప్పుడే గుర్తించాలి.
ప్రేమ ఒక్కటే సరిపోదు
దాంపత్యం కేవలం ప్రేమతోనే నిలబడదు. పరస్పర గౌరవం, నమ్మకం, సహనం, క్షమించే గుణం, అవగాహన కూడా అంతే ముఖ్యమైనవి. ‘నేనే సరైనవాడిని’ అనే అహంకారం తగ్గి, ‘మన బంధం నిలవాలి’ అనే ఆలోచన పెరిగితేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. సహనం లేని ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. అవగాహన లేని అనుబంధం బలపడదు. అందుకే దాంపత్యంలో గెలవాల్సింది వ్యక్తి కాదు.. బంధం.
గొడవలే బంధానికి పరీక్ష
ఎప్పుడూ గొడవలు లేని జంటను ఆదర్శ దంపతులు అనలేం. విభేదాలు వచ్చినా, వాటిని పరిష్కరించుకుని మళ్లీ కలిసి నడిచే జంటే నిజమైన ఆదర్శం. ఒకరి లోపాలను మరొకరు అంగీకరించడం, పరిస్థితులను అర్థం చేసుకోవడం, చిన్న చిన్న విషయాల్లో రాజీ పడడం.. ఇవే దాంపత్యాన్ని దీర్ఘకాలం నిలబెట్టే విలువలు.
పరస్పరం అర్థం చేసుకోవాలి
మారుతున్న జీవనశైలిలో విడాకులు, కుటుంబ విభేదాలు పెరుగుతున్న ప్రస్తుత కాలంలో దాంపత్య బంధం విలువను మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామిని మార్చడం కంటే, పరస్పరం అర్థం చేసుకోవడం గొప్పది. ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించడం ఇంకా గొప్పది.
దాంపత్యం అంటే పరిపూర్ణమైన ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు. అసంపూర్ణమైన ఇద్దరు మనుషులు ఒకరి లోపాలను మరొకరు అంగీకరించి, సుఖదుఃఖాల్లో చేయి విడవకుండా కలిసి నడిచే జీవిత ప్రయాణం. ప్రేమతో ప్రారంభమైన బంధం.. సహనంతో నిలబడుతుంది. గౌరవంతో బలపడుతుంది. చివరి శ్వాస వరకు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలనే మనసే దాంపత్యానికి నిజమైన నిర్వచనం.
