ప్రజా భాగస్వామ్యంతో పరిశుభ్ర నగరం

Vijayawada


విజయవాడ( సత్యనారాయణపురం):
ప్రజా భాగస్వామ్యంతో పరిశుభ్ర నగర నిర్మాణం చేయొచ్చని రాష్ట్ర పట్టణ, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ క్లీన్స్వీప్’ను శనివారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సాంబ మూర్తి రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి మంత్రి నారాయణ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వారాలపాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ జరుగుతుందని పేర్కొన్నారు. మున్సిపాలిటీలను పరిశుభ్రంగా ఉంచడమే కార్యక్రమ ఉద్దేశమని వివరించారు.

మరో అతిధి ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక యంత్ర సామాగ్రితో పారిశుద్ధ్య కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో ఎక్కడా చెత్త కనిపించకుండా పరిశుభ్ర వాతావరణన్ని ప్రజలకు అందించేందుకు కట్టుబడి ఉన్నామని, ఇదే ప్రభుత్వ ఉద్దేశం అని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులు రోడ్లు ఊడ్చారు. డివైడర్లకు పెయింట్లు వేస్తూ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అన్న క్యాంటీన్లో అల్పాహారం స్వీకరించి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు.

కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఏపీ బిల్డింగ్స్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, విజయవాడ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర, మాజీ కార్పొరేటర్లు, అధికార పార్టీ నేతలు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.