యోగాతో ఆరోగ్యం 

Hm anita

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 7 నుంచి జూన్ 21 వ‌ర‌కు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనరేట్ పరిదిలో బి.ఆర్.టి.ఎస్.రోడ్డు వద్ద పోలీసు శాఖలో మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందించడానికి నగర పోలీస్ కమీషనర్ వి. రాజ శేఖర్ బాబు ఆద్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు యోగాంధ్రా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హోం మంత్రి అనిత హాజరయ్యారు. పెద్దఎత్తున యోగా ఔత్సాహికులు సుమారు 5000 మంది పాల్గొని యోగాస‌నాలు అభ్యసించారు.

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలనే సంకల్పంతో యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. భారతీయ సంస్కృతిలో వేల ఏళ్ల చరిత్ర కలిగిన యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. 2014లో ఐక్యరాజ్యసమితి వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 150కు పైగా దేశాలు మద్దతు తెలిపాయని గుర్తు చేశారు.

యోగాకు ప్రత్యేక ఖర్చులు అవసరం లేదని, పేదవాడు నుంచి ధనికుడి వరకు ప్రతి ఒక్కరూ కేవలం ఒక మ్యాట్‌తో యోగాను అభ్యసించవచ్చని పేర్కొన్నారు. జూన్‌ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌, ఆనంద ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.