బెజవాడలో వర్ష బీభత్సం.. కూలిన చెట్లు.. తెగిన విద్యుత్ వైర్లు !

Vijayawada Heavy Rain

విజయవాడలో ఆదివారం సాయంత్రం దాదాపుగా గంట పాటు వర్షం బీభత్సం సృష్టించింది .  ఉదయం నుంచి భానుడు చెలరేగడంతో వేడికి అల్లాడిపోయిన ప్రజలకు సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షం కాస్త కుదుటపడేలా చేసింది .  అయితే, విపరీతమైన గాలులతో వర్షం కురవడంతో నగరంలో చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి .  హోర్డింగ్స్ ఎగిరిపోయాయి .  అలాగే, కొన్ని చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోవడంతో కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది .

ఈదురు గాలులకు విద్యుత్‌ తీగలపై పడిన పరంజా.. తప్పిన ముప్పు
ఈదురుగాలులకు 28వ డివిజన్‌ సత్యనారాయణపురం 3వ నెంబరు బస్సు రూట్‌లో ఆదివారం సాయంత్రం పరంజా విద్యుత్‌ తీగలపై పడింది. అదృష్టవశావత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్‌ తీగలపై పరంజా పడటంతో పెద్ద శబ్ధంతో మంటలు వచ్చి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్‌ సిబ్బంది ఘటనాస్ధలికి చేరుకుని మరమ్మత్తు పనులు చేపట్టారు. అయితే పరంజా వేసిన భవన నిర్మాణ యజమాని అందుబాటులోకి రాకపోవటంతో మరమ్మత్తు పనులకు ఆలస్యం అయ్యింది. సుమారు గంటన్నర సేపు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

కూలిన చెట్టు.. నిలిచిన ట్రాఫిక్‌
సాంబమూర్తి రోడ్డులో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు చెట్టు నేలకూలింది. నిత్యం రద్దీగా ఉండే సాంబమూర్తి రోడ్డులో ఆ సమయంలో చెట్టువద్ద ఎవరూ లేకపోవటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్ధానికులు అంటున్నారు. చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవటంతో కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు ఘటనాస్ధలికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ సీఐ ఎం సుధాకర్, ఎస్‌ఐ జీవీఎన్‌ కుమార్‌ నేతృత్వంలో ట్రాఫిక్‌ పోలీసులు స్ధానికుల సహాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ప్రజల సహకారం వల్లే తాము త్వరితగతిన ట్రాపిక్‌ క్లియర్‌ చేయగలిగామని ట్రాఫిక్‌ సీఐ ఎం సుధాకర్‌ అన్నారు.