- ముందస్తు చర్యలు ఏవీ?
- కృష్ణానది చెంతనే దాహార్తి తీర్చలేక పోతున్నారు
- ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వస్తారు
సత్యనారాయణపురం: రెండేళ్ళ చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేక పోయారని.. తమ హయాంలో నిర్మించి తుది దశకు చేరిన వాటర్ ట్యాంక్‌ను సైతం ప్రారంభించలేని దుస్ధితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ధానిక 30వ డివిజన్ జీవీఆర్నగర్లో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు పూర్తయ్యినప్పటికీ ప్రారంభించనందుకు సోమవారం వాటర్ ట్యాంక్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యాన నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. 15వేల మంది ప్రజల దాహార్తి తీర్చేందుకు తాము రూ. 12 కోట్ల వ్యయంతో వాటర్ ట్యాంక్, పైపులైన్ పనులు 90శాతానికి పైగా పూర్తిచేశామన్నారు. ఇక్కడ ప్రభుత్వ స్ధలం లేకపోవటంతో అప్పటి కార్పొరేటర్ బీ జానారెడ్డి, రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియోషన్ అధికారులతో కలిసి మాట్లాడి టీడీఆర్ బాండ్లు ఇచ్చి మరీ యుద్ద ప్రాతిపదికన వాటర్‌ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టామని గుర్తు చేశారు. అలాగే ప్రజల అవసరాల మేరకు ఆచంట వెంకటరత్నం నాయుడు సర్కిల్లో యూజీడీ పంపింగ్ స్టేషన్‌ను కూడా నిర్మించటం జరిగిందన్నారు. 90శాతంకు పైగా పూర్తయ్యిన వాటర్ ట్యాంక్‌ను ఇప్పటి వరకు వినియోగంలోకి తీసుకురాలేక పోవటం ప్రభుత్వ వైఫల్యంను తెలియ చేస్తుందన్నారు.
ప్రభుత్వ వైఫల్యం
తాము 90శాతంకు పైగా పనులు పూర్తిచేసిన వాటర్ ట్యాంక్‌ను రెండేళ్ళు గడిచినా వినియోగంలోకి తీసుకురాలేకపోవటం ప్రభుత్వ వైఫల్యమేనని మల్లాది విష్ణు అన్నారు. స్ధానిక ప్రజాప్రతినిధులకు ప్రజలపైన వారి సమస్యలపైన ఎంత ప్రేమ ఉందో ఇక్కడ వాటర్ ట్యాంక్ విషయంలోనే తెలుస్తందని అన్నారు.
ముందస్తు చర్యలు ఏవీ…
వేసవి ఎండలు రావటానికి ముందే ప్రణాళికాబద్దంగా పనిచేసి ప్రజల దాహార్తిని తీర్చటంతో పాటు కృష్ణా జలాలు సరఫరా చేసేందుకు వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించాల్సిన ఎమ్మెల్యే, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గంగిరెద్దుల దిబ్బ వద్ద నుంచి తాగునీటి సరఫరా చేసేందుకు అక్కడి స్ధానికులు ప్రజాప్రతినిధులు అంగీకరించటం లేదని చెబుతున్నారని.. ఇక్కడ ప్రజలకు తాగునీరు అందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా అని ప్రశ్నించారు. అక్కడి అధికారులు ప్రజాప్రతినిధులతో మాట్లాడి సత్వరమే వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించి తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
వాటర్ ట్యాంక్‌ను వెంటనే ప్రారంభించాలి
రూ. 12 కోట్ల వ్యయంతో పనులు పూర్తి అయ్యిన వాటర్ ట్యాంక్‌ను తక్షణమే ప్రారంభించాలని లేని పక్షంలో ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని మల్లాది విష్ణు హెచ్చరించారు. ఎమ్మెల్యే అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్‌ను వినియోగంలోకి తీసుకురావాలని లేకుంటే తాము ప్రజలతో కలిసి వీఎంసీ కమీషనర్ కార్యాలయంను ముట్టడించేందుకు సైతం వెనుకాడబోమని అన్నారు. అలాగే తమ హయాంలో వైవీరావు ఎస్టేట్‌లో ప్రారంభించిన వాటర్ ట్యాంక్‌ను తూతూమంత్రంగా ప్రారంభించారని.. కనీసం తాగునీరు సక్రమంగా సరఫరాచేయలేకపోతున్నారని దుయ్యబట్టారు.
మాజీ డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ ,మాజీ కార్పొరేటర్ బీ హెచ్ఎస్వీ జానారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని ఆరోపించారు. కృష్ణానది చెంతనే ఉన్నప్పటికీ ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు సక్రమంగా సరఫరా చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలోమాజీ కార్పొరేటర్ యర్రగొర్ల తిరుపతమ్మ, వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షులు మార్తి చంద్రమౌళి, నాయకులు కుక్కల రమేష్ , కంభం కొండలరావు, గుండె సందర్ పాల్, గుడిసె శ్యాం, తోపుల వరలక్ష్మి ,పేరం త్రివేణి, దొంతుబోయిన దుర్గారావు, సమంతకూరి దుర్గారావు , ఈసరపు రాజు, మహేశ్వర్ రెడ్డి, రాజారెడ్డి ,రామిరెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు
