ఘాట్ రోడ్డు పునరుద్ధరణ షెడ్యూల్‌లో మార్పు 

ghatroad indrakeeladri

దుర్గగుడి ఘాట్ రోడ్డు పునరుద్ధరణ షెడ్యూల్ లో మార్పు జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు టోల్ గేట్ నుంచి  కొండపైకి ఘాట్ రోడ్డు పునరుద్ధరణ  పనులను దేవదాయ శాఖ, ఆర్ అండ్ బీ (R&B) విభాగం సంయుక్తంగా మే 26, 2026 నుంచి  ప్రారంభించిన సంగతి భక్తులందరికీ విదితమే. ఈ పనులను జూన్ 12, 2026 నాటికి పూర్తి చేయాలని ప్రాథమికంగా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ పనుల షెడ్యూల్‌లో తాత్కాలిక మార్పులు చేస్తున్నట్లు ఆర్ అండ్ బీ (R&B) సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈరోజు దేవస్థానం అధికారులకు లేఖ ద్వారా తెలియజేసారు.

విజయవాడ నగరంలో ప్రస్తుతం ఎండ తీవ్రత, వడగాల్పులు (Heat wave) సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ అత్యధిక ఉష్ణోగ్రతలతో  క్షేత్రస్థాయిలో కార్మికులు పనులు చేయడం అత్యంత కష్టతరంగా మారిందని, ఇంతటి తీవ్రమైన వేడి వాతావరణంలో రోడ్డు రిపేర్ పనులు (బిటుమిన్/కెమికల్ మిక్సింగ్) చేపట్టడం సాంకేతికపరంగా సరైనది కాదని,ఈ ఎండల వల్ల రోడ్డుపై మరిన్ని పగుళ్లు (Cracks) వచ్చే ప్రమాదం ఉందని భావిస్తూ తాత్కాలికంగా రోడ్ రిపేర్ పనులు నిలిపి వేస్తున్నట్లు ఆర్ అండ్ బీ (R&B) సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పేర్కొన్నారు.

వాతావరణం సాధారణ స్థితికి వచ్చేంత వరకు శాశ్వత మరమ్మతులను  షెడ్యూల్‌ను మార్చవలసిందిగా ఆర్ అండ్ బీ (R&B) సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజి నీర్ ఈరోజు దేవస్థాన eoకు  అధికారికంగా లేఖ ద్వారా కోరారు.

ప్రస్తుతానికి రోడ్డు పనులు నిలిపివేసి, భక్తుల వాహనాల రాకపోకలకు వీలుగా రోడ్డును తాత్కాలికంగా పునరుద్ధరించడం జరుగుతుంది. ఎండ తీవ్రత తగ్గి, వాతావరణం అనుకూలించిన వెంటనే తిరిగి ఘాట్ రోడ్డు శాశ్వత ఆధునీకరణ పనుల పూర్తి షెడ్యూల్‌ను భక్తులకు ముందుగానే తెలియజేస్తాము.

మే 29 ఉదయం నుంచి  దేవస్థానం ఘాట్ రోడ్ వైపు వాహనాలు యధావిధిగా అనుమతిస్తామని, భక్తులు, వాహనదారులు ఈ మార్పును గమనించి దేవస్థాన సిబ్బందికి సహకరించవలసిందిగా కోరారు.