జూన్ 5 నుంచి ‘కృష్ణవేణి నదీ నవహారతులు పునఃప్రారంభం

durgagudi

సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణవేణి నదీ నవహారతులు కార్యక్రమాన్ని పునఃప్రారంభించడానికి దుర్గగుడి  సర్వసిద్ధమౌతోంది. జూన్ 5వ తేదీ నుంచి  నవహారతుల కార్యక్రమాన్ని వైభవంగా పునఃప్రారంభించి, నిరంతరాయంగా నిర్వహించేందుకు దేవస్థానం తగు చర్యలు చేపట్టింది.

​పవిత్ర సంగమంలో నవహారతుల కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా, ఘనంగా నిర్వహించడానికి కావలసిన తగు సూచనలను లిఖితపూర్వకంగా  సమర్పించవలసిందిగా ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ వారిని ఈవో శీనా నాయక్ కార్యాలయ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర నివేదిక

పవిత్ర సంగమం వద్ద హారతుల నిర్వహణకు అవసరమైన వివిధ ఏర్పాట్ల నిమిత్తం దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, దేవస్థానం సహాయ కమిషనర్, పౌర సంబంధాల అధికారి, వైదిక కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని  ఈవో ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అన్ని వసతులను, ఏర్పాట్లను పరిశీలించి తేదీ జూన్ 2వ తేదీలోపు  లోపు పూర్తి స్థాయి సమగ్ర నివేదికను సమర్పించవలసిందిగా సంబంధిత అధికారులందరికీ ఈవో  స్పష్టమైన గడువును విధించారు. పవిత్ర ​కృష్ణమ్మ తల్లికి ఇచ్చే ఈ నవహారతుల కార్యక్రమం భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేయాలని ఈవో  శీనా నాయక్  అధికారులను ఆదేశించారు.