మన చేతిలోనే .. మన ఆరోగ్యం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మతిమరుపు లేదా జ్ఞాపకశక్తి తగ్గడంఅనేది కేవలం వృద్ధుల సమస్య మాత్రమే కాదు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు .. పిన్న పెద్ద తేడా లేదు ఇలా అన్ని వయస్సుల వారిలోనూ ఈ సమస్య కొంతవరకు కనిపిస్తోంది. అధిక ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం, ఎక్కువసేపు మొబైల్ గానీ కంప్యూటర్ చూడడం వంటి కారణాలు జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతాయి. అందుకే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతటి ముఖ్యమైన విషయం.
మన వంటింట్లో ఉండే కొన్ని సహజ పదార్థాలు మెదడు చురుకుగా పనిచేయడానికి దోహదపడతాయని పెద్దలు చెబుతుంటారు. అలాంటి వాటిలో జాజికాయ ఒకటి. ఇది చక్కటి వాసన వచ్చే సుగంధ ద్రవ్యం మాత్రమే కాకుండా, సంప్రదాయ వైద్య విధానాల్లో కూడా ప్రత్యేక స్థానం పొందింది. పరిమిత మోతాదులో జాజికాయను వినియోగిస్తే శరీరానికి కొంత వరకు ఉపయోగంగా ఉంటుందని భావిస్తారు .
జాజికాయను తీసుకునే ఒక సాధారణ పద్ధతి ఏమిటంటే, ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు లేదా పావు టీ స్పూన్ జాజికాయ పొడిని కలపాలి . దీన్ని రాత్రి సమయంలో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ప్రశాంతత కలగడంతో పాటు మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. మంచి నిద్ర మెదడు పనితీరును మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిద్ర బాగా ఉంటే నేర్చుకున్న విషయాలు గుర్తుంచుకోవడం కూడా సులువుగా ఉంటుంది..
మరికొందరు జాజికాయ పొడిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటారు. అయితే ఏదైనా పదార్థాన్ని అధిక మోతాదులో కాకుండా మితంగా తీసుకోవడం మంచిది. సహజ పదార్థం కాబట్టి ఎలాంటి పరిమితి లేకుండా తీసుకోవచ్చని భావించడంమంచిది కాదు. జ్ఞాపకశక్తినిపెంపొందించుకోవాలంటే జాజికాయతో పాటు మరికొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా అవసరం.
ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలి. పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ వంటి పోషకాహారాన్ని తీసుకోవడం, తగినంత నీరు తాగడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి చర్యలు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, పద్యాలు లేదా సంఖ్యలను గుర్తుంచుకునే చిన్న వ్యాయామాలు చేయడం కూడా జ్ఞాపకశక్తిని చురుకుగా ఉంచుతాయి.
మొత్తానికి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖరీదైన మందులు లేదా ప్రత్యేక చికిత్సలకే ఆధారపడాల్సిన అవసరం లేదు. సరైన జీవనశైలి, పోషకాహారం, తగిన విశ్రాంతి మరియు సహజమైన ఆహారపు అలవాట్లు కలిసివస్తే మెదడు ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోవచ్చు. చిన్న చిన్న మంచి అలవాట్లే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలను దూరం చేయగలవు. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, జ్ఞాపకశక్తిని పదిలంగా ఉంచుకునేందుకు ఈ రోజు నుంచే చిన్నపాటి మార్పులతో మంచి అలవాట్లను ప్రారంభిద్దాం.
