‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు కౌంట్‌డౌన్ ప్రారంభం!

onenation

జమిలి ఎన్నికల అమలుపై కేంద్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో సంబంధిత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు సిద్ధమవుతోంది .  “ఒకే దేశం – ఒకే ఎన్నిక” అనే లక్ష్యంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం, న్యాయపరమైన చిక్కులు  తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  జమిలి ఎన్నికలను రెండు దశల్లో అమలు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి . దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌పై కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.  2029 , 2034 సంవత్సరాల్లో రెండు దశల్లో జమిలి ఎన్నికలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.  మొదటి దశలో దాదాపు 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్‌సభ ఎన్నికలతో అనుసంధానించే అవకాశం ఉంది. మిగిలిన రాష్ట్రాలను 2034 నాటికి అదే ఎన్నికల చక్రంలోకి తీసుకురావడానికి కసరత్తు జరుగుతోంది.

ఈ అంశంపై అధ్యయనం చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ 2026 వర్షాకాల పార్లమెంట్ సమావేశాల చివరి వారంలో తన నివేదికను సమర్పించాల్సి ఉంది.  2029లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో వాటిని లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహించడంలో పెద్దగా ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, త్రిపుర, తెలంగాణ, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం రాష్ట్ర అసెంబ్లీల గడువు ముగియనుంది. ఈ రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని ఐదు నెలల నుంచి ఏడాది వరకు పొడిగించాల్సి రావచ్చు.మరోవైపు బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల గడువు 2030-31 మధ్య ముగియనుంది. జమిలి ఎన్నికల అమలు కోసం ఈ రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని ఒకటి నుంచి రెండు సంవత్సరాల వరకు తగ్గించే పరిస్థితి తలెత్తవచ్చు.

అయితే ఇంత పెద్ద ఎన్నికల సంస్కరణ కార్యక్రమాన్ని  అమలు చేయాలంటే పార్లమెంట్‌లో పలు రాజ్యాంగ, శాసన సవరణలు అవసరం. అంతేకాకుండా విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం కూడా కీలకం కానుంది. అందుకే వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టాక , అవసరమైతే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి చర్చించి ఆమోదం పొందే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికలు అమలైతే గనక  దేశ ఎన్నికల చరిత్రలో అది ఒక కీలక మలుపుగా నిలవనుంది. అలాగే రాష్ట్రాల పదవీకాలాల్లో మార్పులు, రాజకీయ సమీకరణాలు, రాజ్యాంగ సవరణలు వంటి అంశాలు రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారే అవకాశం ఉంది.