సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులకు సూచనలు, దిశా నిర్దేశం చేసారు. కేబినెట్ సమావేశంలో రెండేళ్ల కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాల పైన సమీక్షించారు. మంత్రులు ఇక ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. వైసీపీ చేస్తున్న విమర్శలపై ధీటుగా స్పందించాలని చెప్పారు. అగ్రిగోల్డ్ అంశం పైన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. డీఎస్సీ.. అమరావతి అంశాల పై వైసీపీ విమర్శల పైన చర్చ జరిగింది. ఈ సమయంలో చంద్రబాబు మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఏపీ కేబినెట్ భేటీలో అధికారిక అజెండా తరువాత సీఎం చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా అందరూ ప్రజల్లోకి వెళ్లాలన్నారు. మంత్రులు తమ శాఖలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. గత ప్రభుత్వం నిర్వాకాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని.. అప్పటి నుంచి ఈ రెండేళ్లలో ఏం చేశామో శాఖల వారీగా ఈనెల 28లోపు ప్రజలకు వివరించాలని ఆదేశించారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని చెప్పారు. దేశీయ, స్థానిక అవసరాల మేరకు పంటలు వేసే విధంగా రైతులను ఎడ్యుకేట్ చేయాలని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేయలేదంటూ ఉన్నతాధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నా ఎందుకిలా ఉన్నారని అధికారులపై సీరియస్ అయ్యారు.
వైసీపీ విమర్శలను తిప్పి కొట్టాలని, అగ్రిగోల్డ్ కేసులను వెంటనే పరిష్కరించేందుకు మొత్తం 31 కొత్త పోస్టులు మంజూరు చేసిన సీఎం.. వెంటనే కేబినెట్ సబ్ కమిటీని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. డీఎస్సీపై జగన్ రాద్ధాంతం చేస్తున్నారని.. ప్రజలను అయోమయానికి గురిచేయాలని చూశారని మండిపడ్డారు. గట్టిగా తిప్పికొడితే ఇప్పుడు తోక ముడిచారన్నారు. ‘మనం చెప్పేది వివరంగా ప్రజలకు చెలియచేయాలి. అప్పుడు మాత్రమే ప్రజలకు తెలుస్తుంది’ అని వివరించారు. రైతులను జగన్ గందరగోళంలోకి నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని.. కానీ రాజధాని రైతులు ఇప్పుడ కూడా జగన్ మనస్తత్వాన్ని అర్ధం చేసుకున్నారని సీఎం అన్నారు. జగన్ చెప్పిన మాటలను నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. ప్రజలకు నిజాలు వివరిస్తే వాళ్లు పూర్తిగా అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించి నట్లు సమాచారం. అమరావతి, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నంలో యోగా డే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు.
