3,500 ఏళ్ల నాటి రాతల  రహస్యాలను ఛేదిస్తున్న ఏఐ 

Ai images

పురాతన నాగరికతల అధ్యయనంలో ఏఐ  కీలక ముందడుగు వేసింది. జర్మనీలోని యూనివర్సిటీ అఫ్  రాజబర్గ్   అకాడమీ అఫ్  సైన్సెస్ అండ్ లిటరేచర్ మైన్జ్ పరిశోధకులు కలిసి ” పాలియోగ్రాఫిక్కుమ్ ”  అనే ఏఐ  ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. 3,500 సంవత్సరాలకు పైగా పురాతనమైన క్యూనిఫార్మ్  మట్టి పలకలపై ఉన్న చేతిరాతను చదవడం, పోల్చడం, విశ్లేషించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత.

క్యూనిఫార్మ్ లిపి..

క్యూనిఫార్మ్ ప్రపంచంలోని అత్యంత ప్రాచీన లిపిలో ఒకటి. ప్రాచీన కాలంలో లేఖకులు తడి మట్టిపై ప్రత్యేకమైన స్టైలస్‌తో చీలిక ఆకారపు గుర్తులను చెక్కేవారు. వేల ఏళ్ళ  తర్వాత ఈ మట్టి పలకలు ఎక్కువగా విరిగిన ముక్కల రూపంలో మాత్రమే లభిస్తున్నాయి. వాటిని తిరిగి కలిపి అసలు పత్రాలుగా పునర్నిర్మించడం పురావస్తు శాస్త్రవేత్తలకు  శ్రమతో కూడిన పని.

పాలియోగ్రాఫిక్కుమ్..

“పాలియోగ్రాఫిక్కుమ్” ప్రస్తుతం 70,000కు పైగా ఫోటోలు, 50 లక్షలకుపైగా క్యూనిఫార్మ్ అక్షరాల డేటాబేస్‌ను విశ్లేషించగలదు.  ఒక్కో లేఖకుడి చేతిరాతలో ఉండే సూక్ష్మమైన తేడాలను గుర్తించడం దీనికున్న స్పెషల్ టాలెంట్ . కొందరు లేఖకులు గుర్తులను లోతుగా చెక్కేవారు, మరికొందరు వాటి మధ్య ఎక్కువ లేదా తక్కువ ఖాళీ ఉంచేవారు. ఈ వ్యక్తిగత శైలులను ఏఐ  గుర్తించి, ఫోరెన్సిక్ చేతిరాత నిపుణుడిలా విశ్లేషిస్తుంది.

విప్లవాత్మక మార్పు..

డేనియల్ షౌవెమెర్  ప్రకారం, ఈ సాంకేతికత పరిశోధన రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకువస్తోంది. గతంలో వేల గంటలు పట్టే పనులను ఇప్పుడు ఏఐ చాలా వేగంగా పూర్తి చేయగలుగుతోంది.ఇది కేవలం విరిగిన పలకలను కలపడానికే కాకుండా, ఆ పలకలు ఏ కాలం నాటివో ఆ తేదీ లను కూడా  అంచనా వేయడంలో సహాయపడుతుంది. శతాబ్దాల పాటు చేతిరాతలో వచ్చిన మార్పులను విశ్లేషించడం ద్వారా ఆ పత్రం ఏ కాలానికి చెందినదో గుర్తించే అవకాశం ఉంటుంది.