నేటి సమాజంలో పెరట్లో పచ్చని తోరణం కనుమరుగు అయింది. డ్రాయింగ్ రూమ్‌లో ప్లాస్టిక్ ఫ్లవర్ వచ్చింది. గోరింటాకు స్థానంలో మెహిందీ కోన్, కుంకుడుకాయ స్థానంలో షాంపూ, రుబ్బురోలు స్థానంలో మిక్సీ. ప్రతి మార్పు మన జీవితాన్ని వేగవంతం చేసింది, సులభం చేసింది. కానీ అదే వేగంలో మనం ఆరోగ్యాన్ని, ఆప్యాయతను, మానవీయ విలువలను ఎక్కడో వదిలేశాం. ఇప్పుడు డబ్బు ఉంది, హంగులు ఉన్నాయి. కానీ నిద్ర పట్టడం లేదు, నవ్వు రావడం లేదు. ఇదేనా మనం కోరుకున్న అభివృద్ధి?. సౌకర్యం కొనుక్కుని సంతోషం అమ్మేస్తున్నాం.
ఒకప్పుడు ఇంటి ముందు నిలిచిన చెట్టు కేవలం నీడనే కాదు, ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని, ప్రకృతితో అనుబంధాన్ని కూడా అందించేది. నేటి ఆధునిక కాలంలో ఆ చెట్టు స్థానంలో ఏసీ వచ్చింది. చల్లని గాలి దొరికింది కానీ ప్రకృతి ఒడిలో లభించే ప్రశాంతత కానరావడం లేదు.
ఇంటి బయట పెట్టే కట్టెల పొయ్యి మంటల చుట్టూ కుటుంబ సభ్యులు కబుర్లు చెప్పుకునే రోజులు పోయాయి. గ్యాస్ స్టవ్ వంటను వేగవంతం చేసింది కానీ ఆప్యాయతను కాదు. అరుగులపై కూర్చొని పొరుగువారితో ముచ్చట్లు చెప్పుకునే సంస్కృతి మాయమై, టీవీ తెరల ముందు ఒంటరితనం పెరిగింది.
పెరడు పోయి పాలరాతి ఫ్లోర్లు వచ్చాయి. కుండలు పోయి ఫ్రిడ్జ్‌లు వచ్చాయి. రుబ్బురోలు పోయి మిక్సీలు చెంతకు వచ్చాయి. చేతిపనులు తగ్గి యంత్రాలపై ఆధారపడటం పెరిగింది. సౌకర్యాలు పెరిగి.. శారీరక శ్రమ తగ్గి ఆరోగ్య సమస్యలు పెరిగాయి.
ఒకప్పుడు పుస్తకాలతో పెరిగిన పిల్లలు నేడు మొబైల్ స్క్రీన్‌ల మధ్య ఎదుగుతున్నారు. జ్ఞానం కోసం గ్రంథాలయాలను ఆశ్రయించే తరం స్థానంలో, కొన్ని సెకన్ల వీడియోలతో సరిపెట్టుకునే తరం వచ్చింది. సమాచార సముద్రం చేతిలోకి వచ్చినా, విజ్ఞానం మాత్రం దూరమవుతోంది.
మారుతున్న సంస్కృతి.. మసకబారుతున్న మూలాలు
రంగవల్లులు, పచ్చని తోరణాలు, గోరింటాకు, కుంకుడుకాయలు, పసుపు, మీగడ… ఇవన్నీ ఒకప్పుడు మానవ జీవనశైలిలో భాగం. నేడు వాటి స్థానంలో ప్లాస్టిక్ అలంకరణలు, షాంపూలు, ఫేస్ క్రీములు, మెహిందీ కోన్లు సందడి చేస్తున్నాయి. ప్రకృతి ప్రసాదించిన సహజత్వాన్ని దూరం చేసుకుని, కృత్రిమత్వాన్ని ఆహ్వానించాం .
అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని అనే మధురమైన పిలుపులు “మామ్”, “డాడ్”, “అంటీ”, “అంకుల్”లుగా మారిపోయాయి. భాష మారడంలో తప్పు లేదు. కానీ ఆ పదాల వెనుక ఉన్న భావోద్వేగాలు కూడా క్రమంగా కరిగిపోతున్నాయనే ఆందోళన ప్రస్తుత సమాజంలో కనిపిస్తోంది..
పండుగలు కుటుంబాలను కలిపేవి. ఇప్పుడు అవి వాట్సాప్ స్టేటస్‌లుగా మిగిలిపోతున్నాయి. పెళ్లిళ్లు బంధాలను బలపరిచే వేడుకల నుంచి ఫోటోషూట్లకు, డెస్టినేషన్ ఈవెంట్లకు పరిమితమవుతున్నాయి.
అనుబంధాలు.. లెక్కలుగా..
వృద్ధుల అనుభవం ఒకప్పుడు కుటుంబానికి మార్గదర్శకం. నేడు చాలామంది వృద్ధాశ్రమాల గుమ్మాలు తడుతున్నారు. కుటుంబంలో అనుబంధాలు ఆర్థిక లెక్కలుగా మారుతున్నాయనే భావన కలుగుతోంది. పచ్చని పొలాలు కాంక్రీట్ భవనాలుగా మారాయి. ఎడ్లబండ్ల స్థానంలో వేగవంతమైన వాహనాలు వచ్చాయి. ప్రయాణం వేగంగా సాగుతోంది. కానీ మనిషి మనసు మాత్రం ప్రశాంతత కోసం వెదుకుతూనే ఉంది.
డబ్బు సంపాదన అవసరం. అభివృద్ధి కూడా అవసరమే. కానీ ప్రకృతిని, కుటుంబాన్ని, మానవీయ విలువలను త్యాగం చేసి సాధించిన అభివృద్ధి చివరికి మనల్ని మనమే ప్రశ్నించుకునే పరిస్థితికి తీసుకెళ్తుంది.
ఆధునికతను స్వీకరించడం తప్పు కాదు. కానీ మూలాలను మరచిపోవడం ప్రమాదకరం. సాంకేతికత మన జీవితాన్ని సులభతరం చేయాలి గానీ, మనిషిని యంత్రంగా మార్చకూడదు. చెట్టు నీడను ఏసీ భర్తీ చేయగలదు. కానీ చెట్టు ఇచ్చే ప్రాణవాయువును కాదు. మొబైల్ ప్రపంచాన్ని చూపగలదు. కానీ మనిషి మనసును తాకే అనుబంధాన్ని ఇవ్వలేడు.
- అభివృద్ధి అంటే కొత్తది సంపాదించడం మాత్రమే కాదు.. విలువైనదాన్ని కాపాడుకోవడం కూడా. “పెరుగుట విరుగుట కొరకే” అనే సామెత గుర్తుంచుకుంటూ, ఆధునికతతో పాటు మానవత్వాన్ని కూడా సంరక్షించుకోవాల్సిన సమయం ఇదే.
