స్టీల్‌ప్లాంటులో పేలుడు.. ఎనిమిది మంది చనిపోయారు
అగ్నికీలల్లో కార్మికులు
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో పేలుడు ప్రమాదం.. ఎనిమిది మంది ఉసురు తీసింది. ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇద్దరి పరిస్థి విషమంగా వుంది. ప్రమాద ఘటన అంతా నిమిషాల్లో జరిగిపోయింది. దగ్గరలో ఉన్న కార్మికులు ప్రమాదం నుంచి బయట పడటానికి కానీ.. వారికి సాయంచేసే అవకాశం లేని విధంగా ఘోరం జరిగిపోయింది. ల్యాడిల్‌లోని సుమారు 1500-2000 డిగ్రీల వేడి గల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా పేలడంతో వెంటనే మంటలు చెలరేగాయి. కార్మికులు అగ్నికీలల్లో కాలిపోయారు. స్టీల్ ఉత్పత్తిలో భాగంగా బ్లాస్ట్ ఫర్నేస్‌లో తయారు చేసిన ద్రవపు ఉక్కు(హాట్ మెటల్)ను ల్యాడిల్ ద్వారా స్టీల్ మెల్టింగ్ షాపు (ఎస్ఎంఎస్) విభాగంలోకి తీసుకువెళ్తున్నారు. అది 1,500 డిగ్రీల నుంచి 2000 డిగ్రీల వేడితో ఉంది. అప్పుడప్పుడు ల్యాడిల్ బ్యాలెన్స్ తప్పి కొంత హాట్ మెటల్ కిందకు పడిపోతుంటుంది. అలాగే ల్యాడిల్కు రంధ్రం పడి కూడా కారిపోతుంటుంది. అయితే ఈ సారి అలా జరగలేదు.
ఒక్కసారిగా పేలింది
ల్యాడిల్‌లో హాట్‌మెటల్ ఏ కారణంగానో ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు జరిగిన సమయంలో ల్యాడిల్‌లో 150 టన్నుల సలసలా కాగుతున్న ద్రవపు ఉక్కు ఉంది. పేలుడు ధాటికి ల్యాడిల్ తునాతునకలైపోవడంతో హాట్ మెటల్ నలువైపులా చెల్లాచెదురుగా పడింది. దీంతో మంటలు చెలరేగాయి. హాట్ మెటల్ కింద పడి మంటలు చెలరేగిన ప్రాంతం లోని కంట్రోల్ ఉద్యోగులు కూడా మంటల్లో చిక్కుకున్నారు. ఇలా ల్యాడిల్పైన ఉంటుండగానే పేలడం విశాఖ ఉక్కు చరిత్రలో ఇదే మొదటి సారి.
