మైలవరంలో భారీవర్షం.. ఈదురుగాలులు విద్యుత్ కు తీవ్ర అంతరాయం

heavy rain

విజయవాడ :  పగలంతా రోళ్ళు పగిలే ఎండ వేడి .  సాయంత్రం ఈదురుగాలులతో వర్ష బీభత్సం. రోహిణీ కార్తె మొదటి రోజు సోమవారం మైలవరంలో వాతావరణ పరిస్థితి ఇది. తట్టుకోలేని ఎండ వేడితో తల్లడిల్లిపోయింది మైలవరం. సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. భీకరమైన ఈదురుగాలులు ఈ ప్రాంతాన్ని వణికించేశాయి. దానితో పాటు కురిసిన వర్షం ఉదయం ఎండ నుంచి కాస్త సేదతీరేలా ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు .  కానీ ,  వారి ఆనందం ఏంతో సేపు నిలబడలేదు. ఈదురుగాలుల బీభత్సంతో అనేక చోట్ల చెట్లు విరిగిపడాయాయి .  హోర్డింగ్స్ ఎగిరెగిరి పడ్డాయి .  దాదాపు అరగంట పాటు ఈ బీభత్సం కొనసాగింది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు .  మైలవరం సీఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో స్టేషన్ సిబ్బంది మైలవరం ప్రాంతంలో పడిపోయిన చెట్లు ఇతర వస్తువులు గుర్తించి వాటిని తొలగించే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.

ఈదురుగాలుల దెబ్బకు విద్యుత్ స్తంభాలు చాలా చోట్ల విరిగిపోవడం.. వైర్లు తెగిపోవడంతో కరెంట్ పోయింది.  పలు ప్రాంతాల్లో చిమ్మ చీకటి అలముకుంది .  విద్యుత్ శాఖా సిబ్బంది హుటాహుటిన విరిగిన స్తంభాలు ,  తెగిన కరెంట్ వైర్లను సరిచేసే పనులు చేపట్టారు .  మొత్తంగా చూసుకుంటే మైలవరంలో ఈ రాత్రి గాలివాన సృష్టించిన బీభత్సం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని చెప్పవచ్చు .

heavy rain