ప్రముఖ దర్శకుడు భారతీరాజా (84) మంగళవారం కన్నుమూశారు. ఆయన కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మరణవార్త తో సినీ పరిశ్రమ ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయిందంటూ సినీ ప్రముఖులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
1941 జూలై 17న తమిళనాడులో భారతీరాజా జన్మించారు. 1977లో విడుదలైన 16 వయతినిలే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తమిళ సినిమాను స్టూడియో సెట్ల నుంచి పల్లెలకు తీసుకెళ్లిన దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన చిత్రాలు గ్రామీణ జీవనశైలి, భావోద్వేగాలు, మానవ సంబంధాలను చక్కగా ఆవిష్కరించేవి.
భారతీరాజా తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సన్నిహితుడు. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘సీతాకోకచిలుక’ చిత్రానికి ఆయన ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను అందించగా, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించి సృజనాత్మకతను చాటుకున్నారు.
భారతీరాజా దర్శకుడే కాదు, కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన గురువు కూడా. కమల్ హాసన్, రజనీకాంత్, సత్యరాజ్, భాగ్యరాజ్, రాధిక, రేవతి వంటి పలువురు నటులు ఆయన సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. ‘కిజక్కే పోగుమ్ రైలు’, ‘కాదల్ ఓవియం’, ‘వేదం పుదిథు’, ‘తాజ్ మహల్; వంటి సినిమాలు ఆయనకు మంచి హిట్స్ ఇచ్చాయి. తమిళ సినీ పరిశ్రమలో ఆయనను అభిమానులు ‘ఇయక్కునర్ ఇమయం’(దర్శక శిఖరం) అని గౌరవంగా పిలిచేవారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా భారతీరాజా ప్రేక్షకులను మెప్పించారు. పలు తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి తన నటనా ప్రతిభను నిరూపించారు. ఇటీవల మోహన్‌లాల్ నటించిన తుడురమ్ చిత్రంలో ఆయన చివరిసారిగా వెండితెరపై కనిపించారు.
పద్మశ్రీతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వం సినీ రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2004లో ఆయనకు పద్మశ్రీ ప్రదానం చేసింది. అదనంగా జాతీయ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలతో సహా అనేక గౌరవాలు ఆయన ఖాతాలో చేరాయి. అయితే భారతీరాజా జీవితంలో గత ఏడాది జరిగిన ఒక విషాదం ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఆయన కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా 2025 మార్చిలో గుండెపోటుతో కన్నుమూశారు. కేవలం 48 ఏళ్ల వయసులో కుమారుడు మృతి చెందడం భారతీరాజాను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. అనారోగ్యంతో పోరాడిన చివరి రోజులు ఈ ఏడాది ప్రారంభంలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా భారతీరాజా చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందారు. పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నప్పటికీ, వయోభారం, అనారోగ్య సమస్యలతో చివరకు కన్ను మూశారు . ఇటీవల నటి రాధిక ఆయనను కలిసినప్పుడు, ఆమె నటించిన తాజా చిత్రానికి అవార్డు వస్తుందని ప్రోత్సహించినట్లు సమాచారం. ‘అవార్డు వస్తే మీ పాదాల వద్ద పెడతాను’ అని రాధిక చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
