భారతదేశం కూడా అడుగు వేయాల్సిన సమయమా?
డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియాకు మన జీవితాలు బాగా కనెక్ట్ ఐపోయాయి. ఐతే దాని ప్రతికూల ప్రభావాలు చిన్నారులపై తీవ్రంగా పడుతున్నాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్ పట్టుకుని గంటల తరబడి సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోతున్న బాలలు వాస్తవ జీవితానికి దూరమవుతున్నారు. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన kఅలిగిస్తోంది. అనేక దేశాలు పిల్లలను డిజిటల్ వ్యసనం నుంచి రక్షించేందుకు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించే లక్ష్యంతో కొత్త డిజిటల్ సేఫ్టీ బిల్లును ప్రవేశపెట్టడం విశేషం. ఆన్‌లైన్ వేదికల ద్వారా పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక, సామాజిక ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త బిల్లు ప్రకారం, పిల్లలకు హానికరమైన కంటెంట్‌ను అరికట్టడంలో విఫలమయ్యే సోషల్ మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అనుమతి లేకుండా పంచుకునే అశ్లీల చిత్రాలు, వీడియోలను ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా తొలగించాలని కూడా బిల్లు స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఈ బిల్లులో చోటుచేసుకుంది. డిజిటల్ ప్రపంచం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పిల్లల భద్రతను కాపాడేందుకు ఇది అవసరమైన చర్యగా భావిస్తున్నారు.
కెనడా మాత్రమే కాదు, ఇప్పటికే అనేక దేశాలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాలు 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా వినియోగానికి కఠిన ఆంక్షలు విధించాయి. బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాలు పాక్షిక నిషేధాలను అమలు చేస్తున్నాయి. ఫ్రాన్స్, డెన్మార్క్, పోలాండ్ వంటి యూరోపియన్ దేశాలు కూడా ఇలాంటి చట్టాలను పరిశీలిస్తున్నాయి. గ్రీస్ 15 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనకు నిదర్శనం.
భారతదేశంలో ఈ సమస్య మరింత తీవ్రమైన రూపం దాల్చుతోంది. ప్రపంచంలోనే అత్యంత చవకైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండటంతో చిన్న వయసులోనే పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లకు అలవాటుపడుతున్నారు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా సోషల్ మీడియా వినియోగం విస్తరించింది. విద్యార్థులు చదువుల కంటే రీల్స్, షార్ట్ వీడియోలు, ఆన్‌లైన్ గేమ్‌లపై ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ఫలితంగా చదువుపై ఏకాగ్రత తగ్గిపోవడం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, సామాజిక సంబంధాల బలహీనత వంటి సమస్యలు పెరుగుతున్నాయి. కొందరు వైరల్ కావాలనే తపనతో ప్రమాదకరమైన స్టంట్లు చేసి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచ దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే, చిన్నారుల డిజిటల్ భద్రత ఇకపై వ్యక్తిగత సమస్య కాదు; అది సామాజిక, జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. భవిష్యత్తు తరాల మానసిక ఆరోగ్యం, విద్యా వికాసం, సామాజిక నైపుణ్యాలను కాపాడాలంటే భారతదేశం సమయోచితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
