మంచు ఖండంలో రహస్యాలు 

Gonwana

గోండ్వానా విషయాలు వెలుగులోకి 

అంటార్కిటికా ఖండ గర్భంలో భూ-ఆవిర్భావ చరిత్రకు సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యం వెలుగులోకి వచ్చింది. కిలోమీటర్ల మందంతో పేరుకుపోయిన మంచు పొరల కింద శాస్త్రవేత్తలు ఊహించని భారీ భౌగోళిక నిర్మాణాన్ని గుర్తించారు. నేచర్ జియోసైన్సులో ప్రచురితమైన ఈ పరిశోధన భూగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, అంటార్కిటికా ఖండం ఏర్పాటుకు సంబంధించిన ఇప్పటి వరకు ఉన్న అవగాహనను కొత్త కోణంలో పరిశీలించేలా చేస్తోంది.

తూర్పు అంటార్కిటికాలోని మంచు ఫలకాల కింద మూడు కిలోమీటర్లకు పైగా లోతులో ఈ విశాల నిర్మాణం దాగి ఉంది. గతంలో ఈ ప్రాంతంలో విడివిడిగా ఉన్న కొన్ని చిన్న బేసిన్‌లు మాత్రమే ఉన్నాయని భావించిన శాస్త్రవేత్తలు, తాజా పరిశోధనల ద్వారా అవన్నీ ఒకే అతిపెద్ద వ్యవస్థలో భాగమని గుర్తించారు. విసనకర్ర ఆకారంలో విస్తరించి ఉన్న ఈ నిర్మాణం అనేక ఉప-సముద్రపు బేసిన్‌లను అనుసంధానిస్తూ ఖండం అంతటా వ్యాపించి ఉంది. దీనికి పరిశోధకులు ‘ఈస్ట్ అంటార్కిటిక్ ఫ్యాన్-షేప్డ్ బేసిన్ ప్రావిన్స్’ అనే పేరు పెట్టారు. దీని పరిమాణం, నిర్మాణ లక్షణాలు దృష్ట్యా ఇది ఒక కొత్త టెక్టోనిక్ ప్రావిన్స్గా పరిగణించబడుతోంది.

మంచు పొరల కింద నేరుగా పరిశీలించడం అసాధ్యం కావడంతో శాస్త్రవేత్తలు అత్యాధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించారు. అంతరిక్ష గురుత్వాకర్షణ డేటా, అయస్కాంత సర్వేలు, భూకంప ప్రకంపనల విశ్లేషణ, అలాగే రాడార్ ఇమేజింగ్ ద్వారా మంచు అడుగున ఉన్న భూభాగాన్ని మ్యాప్ చేశారు. ఈ సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన తరువాతే ఈ భారీ నిర్మాణం ఉనికి నిర్ధారితమైంది.

ఈ ఆవిష్కరణ వందల మిలియన్ల సంవత్సరాల క్రితం ఉన్న గోండ్వానా మహాఖండం చరిత్రతో ముడిపడి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకప్పుడు ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో పాటు ఇతర ఖండాలు గోండ్వానా అనే ఏకైక భూభాగంలో భాగంగా ఉండేవి. అనంతరం ఆ మహాఖండం విడిపోతున్న సమయంలో భూమి పైపొరపై ఏర్పడిన తీవ్రమైన ఒత్తిడి, విస్తరణ కారణంగా పగుళ్లు ఏర్పడి, అవే ఈ విసనకర్ర ఆకారపు నిర్మాణంగా రూపాంతరం చెందాయని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. అందువల్ల ఇది ఖండాల కదలికలకు సంబంధించిన కీలక భౌగోళిక ఆధారంగా నిలిచే అవకాశం ఉంది.

ఈ పరిశోధన మరో ఆసక్తికరమైన అంశాన్ని కూడా వెలుగులోకి తెచ్చింది. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు మిస్టరీగా ఉన్న గంబూర్ట్సేవ్ మౌంటైన్స్ ఆవిర్భావ రహస్యాన్ని ఛేదించడంలో కూడా ఈ కొత్త నిర్మాణం కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తున్నారు. మంచు కింద దాగి ఉన్న ఈ పర్వత శ్రేణులను ‘మంచు గర్భంలోని ఆల్ప్స్’ గా కూడా పిలుస్తారు.

ఈ ఆవిష్కరణ భూమి ప్రాచీన చరిత్రను అర్థం చేసుకోవడంలో మాత్రమే కాకుండా, ప్రస్తుత వాతావరణ మార్పుల అధ్యయనంలో కూడా అత్యంత కీలకంగా మారనుంది. మంచు అడుగున ఉన్న భూభాగ స్వరూపమే గ్లేసియర్లు ఏ దిశలో, ఎంత వేగంగా కదులుతాయో నిర్ణయిస్తుంది. ఈ కొత్త సమాచారం ఆధారంగా భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మంచు కరుగుదల వేగం, ప్రపంచ సముద్ర మట్టాల పెరుగుదల వంటి అంశాలను మరింత ఖచ్చితంగా అంచనా వేసే మోడళ్లను రూపొందించే అవకాశం ఉంది.

కిలోమీటర్ల మందంతో కూడిన మంచు కింద లోయలు, పర్వతాలు, జలాశయాలు, విశాల భౌగోళిక నిర్మాణాలతో దాగివున్న ఈ తెలియని ప్రపంచం ఇంకా ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది. తాజా ఆవిష్కరణతో అంటార్కిటికా మానవ పరిశోధనలలో మరో కీలక అధ్యాయాన్ని ప్రారంభించిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.