ఆఫ్రికా నుంచి భారత్ వరకు..
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్రమైన నిరుద్యోగ సమస్యతో ఇబ్బందిపడుతున్నాయి. అంతర్జాతీయ సంస్థల తాజా నివేదికల ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు ఆఫ్రికా ఖండంలోని చిన్న దేశం ఎస్వాటినీలో నమోదవుతోంది. గతంలో స్వాజిలాండ్‌గా పిలవబడిన ఈ దేశంలో నిరుద్యోగిత రేటు సుమారు 34 నుంచి 37 శాతం మధ్య ఉన్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో సౌత్ ఆఫ్రికా నిలిచింది. అక్కడ నిరుద్యోగ రేటు 32 శాతానికి పైగా చేరి ఆందోళనకర స్థాయికి చేరుకుంది.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వరల్ద్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ వంటి అంతర్జాతీయ సంస్థల విశ్లేషణల ప్రకారం, ఆఫ్రికా దేశాల్లోని బలహీన ఆర్థిక వ్యవస్థలు, పరిమిత పారిశ్రామికీకరణ, ఉపాధి అవకాశాల కొరత, పెట్టుబడుల లోపం వంటి అంశాలు నిరుద్యోగ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
ఎస్వాటినిలో ఆర్థిక కార్యకలాపాలు కొన్ని రంగాలకే పరిమితమై ఉండటంతో, చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు అవకాశాలు లభించడం లేదు. మరోవైపు దక్షిణాఫ్రికాలో అధికారిక గణాంకాల ప్రకారం నిరుద్యోగ రేటు 32.7 శాతంగా నమోదైంది. అయితే ఉద్యోగాల కోసం ప్రయత్నించడం మానేసిన వారిని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇదే ప్రాంతంలోని డిజిబౌటీ, బోట్స్వానా వంటి దేశాల్లో కూడా నిరుద్యోగం 20 నుంచి 26 శాతం మధ్య కొనసాగుతోంది.
ఈ ఆఫ్రికా దేశాలతో పోలిస్తే ఇండియాలో మొత్తం నిరుద్యోగిత రేటు తక్కువగానే ఉన్నప్పటికీ, యువ నిరుద్యోగం పెద్ద సవాలుగా మారింది. దేశంలోని మొత్తం నిరుద్యోగుల్లో దాదాపు 83 శాతం మంది 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన యువతే కావడం ఆందోళన కలిగించే అంశం. ఉన్నత విద్యను అభ్యసించిన డిగ్రీ హోల్డర్లకు సైతం మార్కెట్ అవసరాలకు అనుగుణమైన ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతోందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణమైన నైపుణ్యాల కొరత, సంప్రదాయ ఉపాధి రంగాలపై అధిక ఆధారపడటం, అలాగే కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా కోలుకోకపోవడం వంటి కారణాలు నిరుద్యోగాన్ని పెంచుతున్నాయి. దేశాలవారీగా నిరుద్యోగాన్ని కొలిచే విధానాలు భిన్నంగా ఉండటంతో ఖచ్చితమైన పోలికలు కష్టమైనప్పటికీ, ఎస్వాటిని, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో నిరుద్యోగ సమస్య ప్రమాదకర స్థాయికి చేరిందనేది వాస్తవం.
