16 ఏళ్లకే కోట్ల రూపాయల వ్యాపారం
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ యువతి చిన్న వయసులోనే అసాధారణ విజయాన్ని సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం 16 ఏళ్ల వయసులోనే దెల్వ.ఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌ను స్థాపించిన ప్రాంజలి అవస్థి, ప్రస్తుతం యువ పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె కంపెనీ విలువ దాదాపు 12 మిలియన్ డాలర్లు సుమారు రూ.100 కోట్లు చేరుకోవడంతో ఆమె విజయగాథ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.భారత్‌లో జన్మించిన ప్రాంజలి చిన్నతనంలోనే తన కుటుంబంతో కలిసి ఫ్లోరిడాకు వలస వెళ్లింది. ఆమె తండ్రి ఇంజినీర్ కావడంతో సాంకేతిక రంగంపై ఆసక్తి పెరిగింది. ఆ ప్రభావంతో కేవలం ఏడేళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకోవడం ప్రారంభించింది. చిన్న వయసులోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధించిన ఆమె, 13 ఏళ్ల వయసులో మెషిన్ లెర్నింగ్‌కు సంబంధించిన పరిశోధనా ఇంటర్న్‌షిప్‌లో పాల్గొంది.
ఆ పరిశోధన సమయంలో ఆన్లైన్లో అందుబాటులో ఉన్న అపారమైన సమాచారాన్ని విశ్లేషించడం పరిశోధకులకు ఎంత క్లిష్టంగా ఉంటుందో ఆమె గమనించింది. ఈ సమస్యకు సాంకేతిక పరిష్కారం అందించాలనే లక్ష్యంతో 2022 జనవరిలో తన 16వ ఏట డెల్వ్.ఏఐను ప్రారంభించింది.
డెల్వ్.ఏఐ ప్రత్యేకత ఏమిటంటే, ఆన్లైన్ సమాచారం, పరిశోధనా పత్రాలు, పీడీఎఫ్‌లు వంటి విస్తృత డేటా వనరుల నుంచి కీలక అంశాలను వేగంగా గుర్తించి, క్రమబద్ధంగా వినియోగదారులకు అందించడం. దీంతో పరిశోధకులు, విద్యార్థులు, వ్యాపార విశ్లేషకులు తక్కువ సమయంలో అవసరమైన సమాచారాన్ని సులభంగా పొందగలుగుతున్నారు.
ప్రాంజలి ప్రతిభను గుర్తించిన మయామికి చెందిన ఒక స్టార్టప్ యాక్సిలరేటర్ ఆమెకు పెట్టుబడిదారులతో పరిచయాలను కల్పించింది. ఈ అవకాశంతో ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ వంటి సంస్థల నుంచి సుమారు 4.5 లక్షల డాలర్లు (దాదాపు రూ.3.7 కోట్లు) నిధులను సమీకరించగలిగింది.
ఇటీవలి రోజుల్లో X, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఆమె విజయగాథ మళ్లీ ట్రెండ్ అవుతోంది. కంప్యూటర్ సైన్స్‌లో ఉన్నత విద్యను జార్జియా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీలో అభ్యసించిన ప్రాంజలి, ప్రస్తుతం పలు సాంకేతిక ప్రాజెక్టుల్లోనూ చురుకుగా పాల్గొంటున్నట్లు సమాచారం.
చిన్న వయసులోనే సాంకేతిక సమస్యను గుర్తించి, దానికి వ్యాపార పరిష్కారాన్ని అందించడం ద్వారా ప్రాంజలి అవస్థి యువతకు స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచింది. ప్రతిభ, పట్టుదల, సాంకేతిక నైపుణ్యాలు ఉంటే వయసు విజయానికి అడ్డంకి కాదని ఆమె కథ మరోసారి నిరూపించింది.
