ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటిగా పేరుగాంచిన ఎవరెస్ట్ పర్వతంలోని ‘డెత్ జోన్’లో మూడు దశాబ్దాలుగా పడి ఉన్న ఓ భారతీయ పర్వతారోహకుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ప్రత్యేక రికవరీ మిషన్‌కు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ‘గ్రీన్ బూట్స్’గా ప్రసిద్ధి చెందిన ఈ మృతదేహం దాదాపు 30 ఏళ్లుగా ఎవరెస్ట్ అధిరోహకులకు విషాదకర గుర్తుగా నిలిచింది.
ఈ సాహసోపేత ఆపరేషన్ కోసం హై ఆల్టిట్యూడ్ రికవరీలో నైపుణ్యం కలిగిన ప్రత్యేక ఏజెన్సీని నియమించేందుకు ఐటీబీపీ టెండర్ ప్రక్రియను ప్రారంభించింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఈ మిషన్ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సముద్ర మట్టానికి 8,000 మీటర్లకు పైగా ఎత్తులో ఉండే ‘డెత్ జోన్’లోకి వెళ్లి మృతదేహాన్ని కిందకు తీసుకురావడం, అనంతరం నేపాల్ మార్గంగా భారత్‌కు తరలించడం ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం.
ఈ మిషన్ అత్యంత క్లిష్టమైనదిగా భావిస్తున్నారు. ఇందుకోసం కనీసం ఆరుగురు అనుభవజ్ఞులైన షెర్పాలను రంగంలోకి దించే అవకాశం ఉంది. చైనా నియంత్రణలో ఉన్న టిబెట్ ప్రాంతంలోని అధికారుల అనుమతులు పొందడం, సరిహద్దు దాటించడం, చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడం, దశాబ్దాలుగా మంచులో గడ్డకట్టిన మృతదేహాన్ని గౌరవప్రదంగా భద్రపరచడం వంటి బాధ్యతలను కూడా రికవరీ బృందమే నిర్వహించనుంది.
‘గ్రీన్ బూట్స్’గా ప్రసిద్ధి చెందిన ఈ మృతదేహం అసలు ఎవరిదన్నది ఇప్పటికీ పూర్తిగా నిర్ధారణ కాలేదు. అయితే 1996లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఐటీబీపీ బృంద సభ్యులైన లాన్స్ నాయక్ దోర్జే మోరుప్ లేదా హెడ్ కానిస్టేబుల్ త్సేవాంగ్ పాల్జోర్‌లలో ఒకరిదేనని నిపుణులు భావిస్తున్నారు. ఆ ఏడాది ఎవరెస్ట్‌పై సంభవించిన ఘోర ప్రమాదంలో ముగ్గురు భారతీయ పర్వతారోహకులు మరణించగా, వారిలో ఒకరి మృతదేహమే ‘గ్రీన్ బూట్స్’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ఎవరెస్ట్ ఉత్తర మార్గంలో ఉన్న ఒక గుహ సమీపంలో ఈ మృతదేహం ఎన్నో ఏళ్ల పాటు కనిపిస్తూ ఉండేది. అతను ధరించిన ఆకుపచ్చ రంగు పర్వతారోహణ బూట్ల కారణంగానే ‘గ్రీన్ బూట్స్’ అనే పేరు ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పర్వతారోహకులు శిఖరారోహణ సమయంలో ఈ ప్రాంతాన్ని దాటుతుండటంతో, ‘గ్రీన్ బూట్స్’ ఎవరెస్ట్ చరిత్రలో అత్యంత గుర్తింపు పొందిన విషాద చిహ్నంగా మారింది.ఈ మిషన్ విజయవంతమైతే, దాదాపు 30 ఏళ్ల తర్వాత ఓ భారతీయ పర్వతారోహకుడి మృతదేహం ఎవరెస్ట్ డెత్ జోన్ నుంచి స్వదేశానికి చేరుకునే అరుదైన ఘటనగా చరిత్రలో నిలిచిపోనుంది.
