ఆప్యాయతకు కొత్త చిరునామా!

Mother

అద్దెకు అమ్మ..

ఏఐ యుగంలో ఒంటరితనానికి మందుగా ‘అద్దె కుటుంబాలు’

 భవిష్యత్తులో ఇదే అతిపెద్ద సేవారంగమా?

2036 సంవత్సరం.. ఉదయం ఏడు గంటలు. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన అన్నపూర్ణమ్మ ముందుకు వచ్చి నిలిచింది 34 ఏళ్ల ఏఐ ఇంజినీర్ శైలజ.

ఆమెకు నెలకు యాభై లక్షల రూపాయల జీతం. ప్రపంచ స్థాయి సంస్థలో ఉద్యోగం. కానీ కంటి నిండా నిద్ర లేదు. ఆప్యాయంగా పలకరించే అమ్మ లేదు. తన బాధలను చెప్పుకునే కుటుంబం లేదు.

‘ఏంటమ్మా… ఈ జుట్టు చూడు… ఎంత ఒత్తిడిలో ఉన్నావో ముఖమే చెబుతోంది’ అంటూ అన్నపూర్ణమ్మ ప్రేమగా తలకు నూనె రాసింది. కాసేపటికే శైలజ చిన్నపిల్లలా నిద్రలోకి జారుకుంది. తలస్నానం చేయించడం, సాంబ్రాణి వేయడం, ఇడ్లీ, దోశ, అష్టాచెమ్మ ఆడటం, మధ్యాహ్నం ముద్దపప్పు వడ్డించడం.. ఇలా ఒక రోజంతా శైలజకు  అమ్మ ప్రేమను పంచింది అన్నపూర్ణమ్మ.

మరుసటి రోజు వెళ్తూ… ‘అమ్మా… ఈసారి ఒక రోజు స్లాట్‌కు రూ.2,00,000 ట్రాన్స్‌ఫర్ చేశాను. తర్వాత మూడు రోజుల బుకింగ్ చేసుకుంటా’ అంటూ కళ్లలో నీటితో వెళ్లిపోయింది శైలజ.

శైలజ కథ వెనుక ఒక విషాదం ఉంది. చిన్నతనంలో తల్లిదండ్రుల మధ్య గొడవలు. హాస్టల్‌లో చదువుతున్న రోజుల్లో తల్లి ఆత్మహత్య. కొన్నాళ్లకు తండ్రి రెండో వివాహం. కుటుంబం, పెళ్లి అనే వ్యవస్థపై నమ్మకం కోల్పోయిన ఆమె, ఇప్పుడు ‘అద్దెకు అమ్మ’ సేవలను ఆశ్రయిస్తోంది.

ఇక అన్నపూర్ణమ్మది మరో కథ. 53 ఏళ్ల ఆమె పదేళ్ల క్రితం సోషల్ మీడియాలో చదివిన ఒక ఆలోచనను స్టార్టప్‌గా మార్చింది. మొదట తానొక్కరే సేవలు అందించగా… ఇప్పుడు ఆమె సంస్థలో 325 మంది పని చేస్తున్నారు. ‘అద్దెకు అమ్మ’, ‘అద్దెకు నాన్న’, ‘అద్దెకు అన్న’, ‘అద్దెకు అక్క’, ‘అద్దెకు కుటుంబం’… ఇలా భావోద్వేగ అవసరాలను తీర్చే సేవలు అందిస్తున్నారు.

ఇదే సమయంలో మరో బిడ్డ  కోసం అన్నపూర్ణమ్మ సిద్ధమవుతోంది. డేటా సెంటర్ సీఈఓ రవి. అతని వివాహ జీవితం విఫలమై  ఒంటరితనంతో బాధపడుతున్న ఆయనకు ‘ఒక రోజు కొడుకు’ సేవ అందించాల్సి ఉంది ఈ రోజు. ఇలా ఎంతో  మంది  ఆప్యాయతకు కోసం కొత్త చిరునామా కోసం ఎదుర్కొంటున్నారు.

భవిష్యత్తు ఎటువైపు ..

సాంకేతిక విప్లవం వేగంగా మారుతోంది. కృతిమ మేధ అనేక ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అయితే మానవ స్పర్శ, ఆప్యాయత, కుటుంబ బంధాలను మాత్రం ఏ యంత్రం పునఃసృష్టి చేయలేకపోతోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే రోజుల్లో ఎల్డర్లీ కేర్, మానసిక ఆరోగ్య సేవలు, వ్యక్తిగత కౌన్సెలింగ్, కుటుంబ సహాయక సేవలు అత్యంత డిమాండ్ కలిగిన రంగాలుగా మారే అవకాశం ఉంది.

ఉద్యోగ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. కేవలం డిగ్రీలతో ఉద్యోగాలు వచ్చే రోజులు తగ్గిపోతున్నాయి. మానవ నైపుణ్యాలు, భావోద్వేగ ప్రజ్ఞ, సమస్య పరిష్కార సామర్థ్యాలే భవిష్యత్తులో ప్రధాన పెట్టుబడిగా మారనున్నాయి.

పిల్లలకు ఏమి నేర్పాలి?

పోటీ పరీక్షలతో పాటు పిల్లలకు కుటుంబ విలువలు, ఇంటి పనులు, బంధాల ప్రాముఖ్యత, సహానుభూతి వంటి మానవీయ లక్షణాలను నేర్పాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే..

సంపద కంటే ఆరోగ్యం విలువైనది. సాంకేతికత కంటే సంబంధాలు గొప్పవి. విజయం కంటే ఆప్యాయత అవసరమైనది. ఒంటరితనం మహమ్మారిగా మారుతున్న ఈ కాలంలో ‘అద్దెకు అమ్మ’ అనేది కేవలం వ్యాపారం కాదు.. మనిషి కోల్పోతున్న బంధాల కోసం చేసే అన్వేషణ. అందరూ బాగుండాలి… అందులో మనముండాలి.