ఉగ్రోష్ణతలు..

Heavy heat

యూరప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రికార్డు స్థాయి ఎండలు

యూరప్‌ ఖండంలో ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి.  ముఖ్యంగా ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజల సాధారణ జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఇంట్లోనే ఉన్నా వేడి నుంచి ఉపశమనం లభించకపోవడంతో ప్రజలు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేడి నుంచి ఉపశమనం కోసం నీటిలోకి దిగిన వారిలో గత ఐదు రోజుల్లోనే 40 మంది మరణించారని సమాచారం. 

ఫ్రాన్స్‌లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారడంతో దేశ వాతావరణ సంస్థ ‘మెటియో ఫ్రాన్స్‌’ సగానికి పైగా ప్రాంతాలకు అత్యున్నత స్థాయి ‘రెడ్ హీట్‌వేవ్ అలర్ట్‌’ జారీ చేసింది. పగలు, రాత్రి తేడా లేకుండా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఇంగ్లిష్‌ చానల్‌ అవతల ఉన్న బ్రిటన్‌లోనూ వేడి తీవ్రత పెరుగుతోంది. అక్కడి వాతావరణ శాఖ బుధ, గురువారాల కోసం ‘రెడ్ ఎక్స్‌ట్రీమ్ హీట్ వార్నింగ్’ ప్రకటించింది. జూన్‌ నెల చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ ఇంగ్లాండ్‌లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌కు, ఆగ్నేయ వేల్స్‌లో 35 డిగ్రీల వరకు చేరుకునే అవకాశముండగా, కొన్ని ప్రాంతాల్లో 39 డిగ్రీల మార్కును దాటవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ప్రస్తుత పరిస్థితులు 2003లో యూరప్‌ను వణికించిన ఘోర ఉష్ణ తరంగాలను గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో ఫ్రాన్స్‌లో ఎయిర్‌ కండిషనింగ్‌ సదుపాయాలు లేని వృద్ధాశ్రమాలు, నివాస సముదాయాల్లో నివసిస్తున్న సుమారు 15 వేల మంది వృద్ధులు ఎండల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాద ఘటనల తర్వాత ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రత్యేక ‘హీట్‌ వాచ్ వార్నింగ్ సిస్టమ్‌’ను అమలు చేసింది.

యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వివరాల ప్రకారం, 1980ల నుంచి ప్రపంచ సగటుతో పోలిస్తే యూరప్‌ ఖండం దాదాపు రెట్టింపు వేగంతో వేడెక్కుతోంది. వాతావరణ మార్పుల ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఉష్ణ తరంగాలు మరింత తరచుగా, మరింత తీవ్రంగా సంభవించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.