ఒకే ఇంట్లో.. ఒకరికి ఒకరు అతిథులే

Dinner

కలిసి భోజనం  చేయడం గగనమే 

ఆకలి తీరడానికి కాదు.. మనసులు కలపడానికే ..

బిజీ లైఫ్ లో బంధాలు దూరం 

ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి కూర్చుని తినేవారు ఒకప్పుడు. అది రోజువారీ జీవితంలో భాగంగా ఉండేది. ఆ సమయంలో పెద్దల సలహాలు, పిన్నల నవ్వుల పువ్వులు, మనసు నిండా వచ్చే మాటలతో ఇంటి వాతావరణం ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఆ ఇంట్లోనే వుంటారు. కానీ అందరిదీ తలోదారి.. ఒక్కో  సమయంలో.. చేతిలో సెల్ ఫోన్తో  భోజనం చేస్తున్నారు. ఆకలి తీరుతోంది. కడుపు నిండుతోంది.. కానీ ఆ ఆత్మీయతలు కానరావడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య మనస్ఫూర్తిగా వచ్చే  మాటలు, ఆత్మీయత, అనుబంధాలు దూరమవుతున్నాయి.

ప్రతి మనిషికి కుటుంబ బంధమనేది  మొదటి పాఠశాల. ఆ కుటుంబ బంధాన్ని మరింత దరి  చేర్చేది.. కలిసి గడిపే సమయం. అందులో ప్రధానమైనది కలిసి భోజనం చేయడం. ఆహారం కేవలంకడుపు నింపుకోవడానికే మాత్రమే కాదు.. ఒకరినొకరు మాట్లాడుకోవడం, రోజంతా జరిగిన విషయాలను చర్చించుకోవడం, ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకోవడం, నవ్వులను పంచుకోవడం కూడా.

అయితే కాలానుగుణంగా మారుతున్న జీవన విధానం ఈ సంప్రదాయాన్ని దూరం చేస్తోంది. ఉద్యోగాలతో సతమతం, పిల్లల చదువులు, కోచింగ్‌లు, షిఫ్ట్ వేళలు, నగర జీవనం వంటి కారణాలతో ప్రతి ఒక్కరి జీవన విధానం  వేరుగా మారిపోయింది. దానికి తోడు మొబైల్ ఫోన్లు, టీవీ, ఓటీటీ వేదికలు భోజన వేళలో కూడా మనుషుల దృష్టిని కుటుంబం నుంచి పక్కకు మళ్లిస్తున్నాయి.

ఒకే గృహం లో ఉంటున్నా ఒకరు టీవీ ముందు, మరొకరు సెల్  చూస్తూ, ఇంకొకరు తమ గదిలో విడిగా  భోజనం చేసే పరిస్థితి ఎదురవుతోంది. ఫలితంగా ఒకరికొకరి మధ్య  దూరం పెరుగుతోంది.. అవగాహన తగ్గుతోంది. చిన్నపాటి  ఇబ్బందులు కూడా బయటకు చెప్పుకోలేక మనసులోనే దాచుకునే పరిస్థితి ఎదురవుతోంది..

మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం కనీసం  రోజుకు ఒక్కపూటైనా అందరూ  కలిసి భోజనం చేస్తే నమ్మకం పెరుగుతుంది. చిన్నారుల్లో  ఆత్మవిశ్వాసం, మాట్లాడటం మెరుగుపడుతుంది. పెద్దల అనుభవం చిన్నారులకు జీవిత పాఠాలవుతాయి. కుటుంబంలో ఒత్తిడి కూడా తగ్గుతుంది.

లంచ్ టైములో సెల్ ఫోన్లను పక్కన పెట్టడం, టీవీ  ఆపేయడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వంటి చిన్న అలవాట్లు కుటుంబ సభ్యుల మధ్య  బంధాలను మరింత పెంచుతాయి . ఇలాంటి  మార్పులకు పెద్ద ఖర్చు కూడా కాదు.

చకచకా  మారుతున్న విశ్వం లో సంపాదన అవసరమే. దాని కోసం కుటుంబంతో గడిపే విలువైన సమయాన్ని కోల్పోతే తిరిగి తెచ్చుకోలేం. రోజుకు కనీసం ఒక్కపూటైనా అందరూ కలిసి కూర్చుని భోజనం చేసే అలవాటును మళ్లీ మొదలుపెడదాం. కేవలం భోజనం మాత్రమే కాదు… ఆత్మీయత, బంధాలు, ఆనందం కూడా ఒకే కంచంలో నిండుగా కనిపిస్తాయి.