బడంటే భయం కాదు.. భవితకు బంగరు బాట!

SCHOOL

కొత్త స్కూల్.. కొత్త వాతావరణం.. చిన్నారుల్లో ఎందుకీ బెరుకు?

తల్లిదండ్రుల సహనమే పిల్లల ఆత్మవిశ్వాసానికి పునాది

ఏడుస్తూ వెళ్లే పిల్లలను ఆనందంగా బడికి పంపాలంటే..

పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇంటింటా సందడి నెలకొంది. కొత్త యూనిఫాం, కొత్త బ్యాగ్, రంగురంగుల వాటర్ బాటిల్, మెరిసే షూలతో చిట్టి చేతులు పట్టుకుని పిల్లలు బడికి బయలుదేరితే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అదే సమయంలో, తమ చిన్నారులు కొత్త వాతావరణానికి ఎలా అలవాటు పడతారో అనే ఆందోళన కూడా వారిని వెంటాడుతుంది.

కొంతమంది పిల్లలు మొదటి రోజు నుంచే సంతోషంగా బడికి వెళ్తారు. కొత్త స్నేహితులను చేసుకుంటూ, ఉపాధ్యాయులతో కలిసిపోతూ చదువును ఆస్వాదిస్తారు. కానీ మరికొందరు మాత్రం పాఠశాల పేరు వినగానే భయపడిపోతారు. ఏడవడం, తల్లిదండ్రులను వదలకుండా ఉండడం, స్కూల్‌కు వెళ్లనని మొండికేయడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇది చాలా కుటుంబాల్లో సహజంగా ఎదురయ్యే సమస్యే.

ముఖ్యంగా తొలిసారి బడిలో అడుగుపెట్టే చిన్నారులకు ఇంటి వాతావరణం నుంచి ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోకి వెళ్లడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. అలాగే ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారిన పిల్లల్లో కూడా కొత్త ఉపాధ్యాయులు, కొత్త స్నేహితులు, కొత్త నియమాలకు అలవాటు పడే వరకు కొంత బెరుకు కనిపిస్తుంది. దీనిని సమస్యగా కాకుండా, పిల్లల ఎదుగుదలలో సహజమైన దశగా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.

పిల్లలను బలవంతంగా స్కూల్‌కు పంపడం కంటే, బడి గురించి మంచి విషయాలు చెప్పడం ఎంతో ప్రయోజనకరం. అక్కడ కొత్త స్నేహితులు దొరుకుతారని, ఆటలు ఆడతారని, కథలు వింటారని, కొత్త విషయాలు నేర్చుకుంటారని ముందుగానే చెప్పాలి. పాఠశాలపై ఆసక్తి పెరిగేలా చిన్నచిన్న సంభాషణలు చేయాలి.

కొత్త పాఠశాలలో చేరే ముందు అవకాశం ఉంటే ఒకసారి పిల్లలను అక్కడికి తీసుకెళ్లాలి. తరగతి గది, ఆట స్థలం, ఉపాధ్యాయులను ముందుగానే పరిచయం చేస్తే భయం చాలావరకు తగ్గుతుంది. మొదటి కొన్ని రోజులు పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ వారికి ధైర్యం చెప్పడం చాలా అవసరం.

పిల్లలు ఏడుస్తున్నారని కోప్పడడం, ఇతర పిల్లలతో పోల్చడం, బెదిరించడం వంటి చర్యలు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తాయి. ప్రతి చిన్నారి స్వభావం వేరు. కొందరు త్వరగా కలిసిపోతారు, మరికొందరికి కొంత సమయం పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఓర్పుతో వ్యవహరించాలి.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పరస్పరం మాట్లాడుకుంటూ పిల్లల ప్రవర్తనను గమనిస్తే వారికి అలవాటు పడటం మరింత సులభమవుతుంది. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, ప్రతి చిన్న విజయాన్ని అభినందించడం ద్వారా పాఠశాలపై ప్రేమను పెంపొందించవచ్చు.

పిల్లలకు విద్య అనేది కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదు… జీవితాన్ని నేర్పించే తొలి అడుగు. ఆ తొలి అడుగు ఆనందంగా పడేలా చేయడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి తీసుకోవాల్సిన బాధ్యత. భయాన్ని తొలగించి, బడిని సంతోషాల నిలయంగా మార్చగలిగితే ప్రతి చిన్నారి చిరునవ్వుతో పాఠశాల బాట పడతాడు.