– కర్మ సిద్ధాంతం, మనోవిజ్ఞానం చెప్పేదేమిటి
పురాణాల్లో రాజులు, రుషులు, దేవతల జీవితాలను కూడా మార్చేసిన శాపాల కథలు ఎన్నో కనిపిస్తాయి. కొన్ని మాటలు నిజంగానే ఒకరి జీవితాన్ని మార్చగలవా? లేక అవి కేవలం కథలకే పరిమితమా ? అయితే ఈ ప్రశ్నకు సమాధానం మూఢనమ్మకాలలో కాదు. ఆధ్యాత్మికత, మనోవిజ్ఞానం, కర్మ సిద్ధాంతం కోణాల్లో పరిశీలిస్తే అసలు భావం అర్థమవుతుంది.
పురాణాల్లో శాపం అంటే సాధారణ కోపం కాదు
పురాణాలు, ఇతిహాసాల్లో శాపం అనేది కోపంతో అన్న మాటలు అని తెలుస్తోంది . ఎన్నో ఏళ్ళ తపస్సు, సత్యనిష్ఠ, ఆత్మనిగ్రహం, ధ్యానం ద్వారా గొప్ప ఆధ్యాత్మిక శక్తిని సంపాదించిన మహర్షులు లేదా సిద్ధులు మాత్రమే శాపం ఇచ్చేవారని గ్రంథాలు చెబుతున్నాయి. వారి మాటలకు ప్రభావం ఉండటానికి కారణం కోపం కాదు. వారు సాధించిన ఆధ్యాత్మిక శక్తి, సత్యవాక్కు, తపస్సే కారణమని పురాణాలు వివరిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కోపంలో అన్న మాటను శాపంగా భావించకూడదని ఈ కథలే సూచిస్తున్నాయి.
‘వాక్ సిద్ది ‘ అంటే ఏమిటి?
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ‘వాక్ సిద్ధి’ అనే భావన ఉంది. దీని అర్థం, గొప్ప తపస్సు చేసి ఆధ్యాత్మిక పరిపక్వత సాధించిన వ్యక్తి చెప్పిన మాట నిజమవుతుందనే విశ్వాసం. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన విషయం కాదు. కానీ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. నిజాయితీ, ఆత్మనిగ్రహం, తపస్సు, ధర్మబద్ధమైన జీవితం గడిపిన వ్యక్తి మాటలకు విలువ, ప్రభావం ఎక్కువగా ఉంటుందని.
ప్రస్తుత జీవితానికి అదే వర్తిస్తుందా?
పురాణాల్లో చెప్పిన మహర్షులు అత్యంత కఠినమైన తపస్సు, ధ్యానం, సాదాసీదా జీవనం, ఇంద్రియనిగ్రహంతో జీవించారు. నేటి మనుషుల జీవన విధానం భిన్నంగా ఉంది. అందువల్ల ‘నేను నిన్ను శపిస్తున్నాను’ అని ఎవరో కోపంతో చెప్పినంత మాత్రాన దానికి అతీంద్రియ శక్తి ఉంటుందని చెప్పలేమని ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు అభిప్రాయపడుతున్నారు. పురాణాల్లో చెప్పిన శాపశక్తి అనేది అత్యంత అరుదైన ఆధ్యాత్మిక సాధన ఫలితమని వారు వివరిస్తున్నారు.
చేసిన తప్పుకు ఫలితం ఉంటుంది
శాపాలను నమ్మకపోయినా, అమాయకులను బాధపెట్టడం వల్ల నిజ జీవితంలో కర్మ పరిణామాలు తప్పవు. ఇతరుల మనసును గాయపరచడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. మనలో అపరాధ భావన పెరుగుతుంది. నమ్మకం కోల్పోతాం. మన ప్రవర్తన భవిష్యత్తులో మన జీవితంపైనే ప్రభావం చూపుతుంది. మనోవిజ్ఞానం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. హిందూ తత్వశాస్త్రం దీనినే కర్మ సిద్ధాంతం రూపంలో వివరిస్తుంది.
శాపం, కర్మ రెండూ ఒకటే కావు
చాలామంది శాపం, కర్మ ఒకటేనని అనుకుంటారు. కానీ హిందూ తత్వంలో ఈ రెండింటికీ తేడా ఉంది. కర్మ అంటే మనం చేసే పనులు, మన ఉద్దేశాలు, మన నిర్ణయాల ఫలితం. మన భవిష్యత్తును నిర్ణయించేది ప్రధానంగా మన కర్మలేనని హిందూ తత్వం చెబుతుంది. అయితే శాపం అనేది పురాణాల్లో కనిపించే ప్రత్యేక సందర్భం. అది అందరికీ వర్తించే సాధారణ నియమం కాదు. ఈ తేడాను అర్థం చేసుకుంటే అనవసర భయాలు తగ్గి, బాధ్యతాయుతమైన జీవన విధానం అలవడుతుంది.
పురాణ కథల అసలు సందేశం ఏమిటి?
శాపాల కథలను చరిత్రగా భావించినా, ప్రతీకలుగా భావించినా, వాటి ప్రధాన ఉద్దేశం భయపెట్టడం కాదు.సత్యాన్ని గౌరవించాలి. ఇతరులకు అన్యాయం చేయకూడదు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అహంకారాన్ని తగ్గించుకోవాలి. దయ, కరుణ, వినయంతో జీవించాలి అనే సందేశాలు ఇస్తాయి.
