18 కీలక ఒప్పందాలతో భారత్–ఆస్ట్రేలియా బంధానికి కొత్త ఊపు

MODI (1)

భారత ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి మోదీ మొత్తం 18 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో శాంతియుత అణుశక్తి వినియోగం కోసం భారతదేశానికి యురేనియం ఎగుమతి, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, కీలక ఖనిజాలు, వాణిజ్యం, రక్షణ రంగాల్లో సహకారానికి సంబంధించిన ఒప్పందాలు ప్రధానమైనవి.

యురేనియం ఒప్పందం ద్వారా భారత్  తన అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకునే అవకాశం లభించనుండగా, ఆస్ట్రేలియాకు తన ఖనిజ వనరులకు భారత్ రూపంలో పెద్ద మార్కెట్ లభించనుంది. గ్రీన్ ఎనర్జీ, కీలక ఖనిజాల సరఫరా గొలుసు, సాంకేతిక సహకారాన్ని విస్తరించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

మెల్‌బోర్న్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ ‘ఆస్ట్రేలియా, భారత్  భాగస్వాములు మాత్రమే కాదు.. నిజమైన మిత్రదేశాలు’ అని పేర్కొన్నారు. ప్రధాని మాట్లాడుతూ, ఇరు దేశాల భాగస్వామ్యం చారిత్రాత్మక అవకాశాలను సృష్టిస్తోందని, భారతదేశంలో రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా కంపెనీలను ఆహ్వానించారు.

మోదీ పర్యటనకు ఆస్ట్రేలియా మీడియాలో కూడా విశేష ప్రాధాన్యం లభించింది. పలు ప్రముఖ వార్తాపత్రికలు ఆయన పర్యటనను మొదటి పేజీలో ప్రచురించాయి. ఆస్ట్రేలియా వార్తాపత్రిక కాలమిస్ట్  మోదీని ‘మిస్టర్ ఇండియా’ గా అభివర్ణించగా, మరో ప్రముఖ దినపత్రిక ‘వాణిజ్యం, రక్షణ రంగాలకు మోదీ కొత్త అవకాశాలు తీసుకొచ్చారు’ అని టైటిల్ పెట్టింది . ‘ది ఏజ్’ పత్రిక ‘అల్బనీస్ మోదీ ఆపరేండీ’అనే శీర్షికతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

మెల్‌బోర్న్‌లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. వేలాది మంది భారతీయులు “మోదీ… మోదీ…” అంటూ నినాదాలు చేస్తూ  స్వాగతం పలికారు. ప్రధానిగా తాను ఆస్ట్రేలియాకు చేస్తున్న ఇది మూడో పర్యటన అని, భారత్–ఆస్ట్రేలియా సంబంధాలు గతంలో కంటే మరింత బలపడుతున్నాయన్నారు.